రాయల్ ఎన్‌ఫీల్డ్ 4 కొత్త బైక్స్

Royal Enfield : బైక్ ప్రియులకు ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. భారతీయ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే 12 నెలల్లో తమ చరిత్రలోనే అత్యంత దూకుడుగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతోంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా నాలుగు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఈ లైన్‌అప్‌లో కొత్త 650సీసీ మోడల్స్‌తో పాటు, కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కూడా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరికొత్త టెక్నాలజీ, పవర్, స్టైలింగ్‌తో రానున్న ఈ నాలుగు బైక్‌ల వివరాలు, ఫీచర్లు తెలుసుకుందాం.

1. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650సీసీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లెట్ మోడల్‌ను మరింత శక్తివంతంగా తీసుకువస్తోంది. ఈ మోటార్‌సైకిల్ బుల్లెట్‌కు ప్రత్యేకమైన మినిమలిస్ట్ రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, పిన్‌స్ట్రైప్డ్ ట్యాంక్, మెటల్ భాగాలు, నిటారుగా ఉండే అప్‌రైట్ స్టాన్స్ దీని స్టైలింగ్‌ను క్లాసిక్‌గా ఉంచుతాయి. ఇందులో అదే సుపరిచితమైన 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 47 బీహెచ్‌పీ పవర్, 52 ఎన్‌ఎమ్ కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అసిస్ట్ క్లచ్ జోడించబడ్డాయి. పాత ఫీలింగ్‌ను అందిస్తూనే, ట్విన్ ఇంజిన్‌కు అనుగుణంగా ఫ్రేమ్‌ను బలంగా చేశారు. ఈ బైక్ రాబోయే నెలల్లో అందుబాటులోకి వస్తుంది. దీని అంచనా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.5 లక్షలుగా ఉండవచ్చు.

2. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లాసిక్ 650 స్పెషల్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్‌ను EICMA 2025 లో ప్రదర్శించారు. ఇది హైపర్‌షిఫ్ట్ రంగులో వస్తుంది. అంటే, కాంతిని బట్టి ఈ బైక్ రంగు ఎరుపు, బంగారు రంగుల్లో మారుతుంది. దీని కింద అదే శక్తివంతమైన 648 సీసీ ట్విన్ ఇంజిన్ ఉంటుంది.

3. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6

రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్‌లోకి తీసుకురానున్న మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో C6 ఒకటి. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చారిత్రక ఎయిర్‌బోర్న్ పారాట్రూపర్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి ప్రేరణ పొందింది. అల్యూమినియం కాంపోనెంట్‌లు, కాంపాక్ట్ బ్యాటరీ కేస్‌తో ఇది చాలా తక్కువ బరువు ఉండేలా రూపొందించబడింది. గార్డర్-స్టైల్ ఫ్రంట్ సెటప్, క్లీన్ బాడీవర్క్‌తో ఇది నియో-రెట్రో లుక్ ఇస్తుంది. C6 ఉత్పత్తి ఆర్థిక సంవత్సరం 2026 చివరిలో ప్రారంభమవుతుంది.

4. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6

ఫ్లయింగ్ ఫ్లీ C6 ఒక సాధారణ కమ్యూటర్ బైక్ అయితే, S6 దాని అడ్వెంచరస్ వెర్షన్. ఇది స్క్రేంబ్లర్ నుంచి ప్రేరణ పొందిన ఆకారం, పొడవైన సస్పెన్షన్ ట్రావెల్, నిటారుగా ఉండే పొజిషన్, డ్యూయల్-పర్పస్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రేమ్ మరింత బలంగా, దృఢంగా కనిపిస్తుంది. దీని లాంచింగ్ 2026 చివరి నాటికి జరగనున్నట్లు తెలుస్తోంది.. S6 లో C6 బ్యాటరీ కాంపోనెంట్‌లే ఉంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story