E20 పెట్రోల్ కష్టాలకు చెక్ పెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ పాత బైక్‌లు వాడుతున్న వారికి ఒక అదిరిపోయే తీపి కబురు అందింది. వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా కేవలం E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన ఇంధనం) మాత్రమే అందుబాటులో ఉండనుంది. పాత BS3, BS4 మోడల్ బైక్‌లలో ఈ ఇంధనం వాడితే ఇంజిన్, ఇంధన వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, తన పాత కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా ఒక E20 కన్వర్షన్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ముఖ్యంగా UCE ఇంజిన్, కార్బ్యురేటర్ ఉన్న పాత బైక్‌ల కోసం ఈ కిట్‌ను రూపొందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ పాపులర్ మోడల్స్ అయిన క్లాసిక్ 350 , బుల్లెట్ 350, థండర్‌బర్డ్ పాత వెర్షన్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. 2020 కంటే ముందు కొన్న బైక్‌లు E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉండవు కాబట్టి, ఈ కిట్ వేయించుకోవడం చాలా అవసరం. ఇందులో కొత్త పైపులు, సీల్స్, O-రింగ్స్ వంటి భాగాలు ఉంటాయి. ఇవి ఇథనాల్ వల్ల రబ్బర్ పాడవకుండా, తుప్పు పట్టకుండా కాపాడతాయి.

ఈ కిట్ ధరకు సంబంధించి కూడా కంపెనీ ఊరటనిచ్చింది. BS4 మోడళ్ల కోసం ఈ కిట్ ధర సుమారు రూ.1,700 గా నిర్ణయించారు. 500cc బైక్‌ల కోసం విడిగా కిట్ లేకపోయినా, 350cc కిట్‌లోని కొన్ని భాగాలను వాటికి కూడా వాడుకోవచ్చు. ఈ కిట్ వేయించుకోవడం వల్ల ఇంజిన్ రక్షణతో పాటు బైక్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో స్టార్టింగ్ సమస్యలు, యాక్సిలరేషన్ ఇబ్బందులు ఉన్నవారికి ఈ కిట్ ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది.

ప్రస్తుతం ఈ కిట్‌లు అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున కొన్ని చోట్ల కొద్దిరోజులు వేచి చూడాల్సి రావచ్చు. మీ పాత బుల్లెట్ భవిష్యత్తులో కూడా మొరాయించకుండా హాయిగా సాగాలంటే, వెంటనే దగ్గరలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ E20 కిట్‌ను అమర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్రోల్ ట్యాంక్ పాడవకుండా ఉండటమే కాకుండా, బైక్ వాల్యూ కూడా పెరుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story