Royal Enfield Guerrilla 450 vs Triumph Speed 400: రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా వర్సెస్ ట్రయంఫ్ స్పీడ్ 400.. రోడ్లపై అసలైన రారాజు ఎవరు?
రోడ్లపై అసలైన రారాజు ఎవరు?

Royal Enfield Guerrilla 450 vs Triumph Speed 400: భారతీయ రోడ్లపై ఇప్పుడు మిడ్-కెపాసిటీ బైక్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా 400 నుంచి 450 సీసీ విభాగంలో యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, ట్రయంఫ్ స్పీడ్ 400 మధ్య జరుగుతున్న పోరు. ఈ రెండు బైక్లు కూడా పర్ఫార్మెన్స్, స్టైల్, రోజువారీ వాడకానికి సరిగ్గా సరిపోతాయి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది మీ బడ్జెట్ కి తగుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
ముందుగా ధర విషయానికి వస్తే.. ట్రయంఫ్ స్పీడ్ 400 ఇక్కడ పైచేయి సాధిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450ని సొంతం చేసుకోవాలంటే మీరు కనీసం రూ.2.56 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ట్రయంఫ్ బైక్ దాదాపు 17 వేల రూపాయలు తక్కువ ధరకే లభిస్తోంది. హిమాలయన్ 450కి ఒక స్ట్రీట్ వెర్షన్ లా గెరిల్లాను డిజైన్ చేస్తే, ట్రయంఫ్ తన క్లాసిక్ బ్రిటిష్ రోడ్‌స్టర్ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఇంజిన్ పవర్ విషయానికొస్తే రెండూ పోటాపోటీగా ఉన్నాయి. గెరిల్లా 450లో 452 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 40.02 పీఎస్ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. మరోవైపు ట్రయంఫ్ స్పీడ్ 400లో 398 సీసీ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది కూడా 40 పీఎస్ పవర్ ని ఇస్తుంది కానీ టార్క్ మాత్రం 37.5 ఎన్ఎమ్ మాత్రమే. ఇక్కడ గెరిల్లాలో టార్క్ ఎక్కువగా ఉండటం వల్ల లో-స్పీడ్ లో కూడా బైక్ చాలా వేగంగా దూసుకుపోతుంది. రెండు బైక్లలో కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ సౌకర్యం ఉంది.
ఫీచర్ల పరంగా చూస్తే గెరిల్లా 450 కాస్త మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని టాప్ వేరియంట్లలో 4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే ట్రయంఫ్ స్పీడ్ 400లో క్లాసిక్ అనలాగ్ స్పీడోమీటర్ తో పాటు చిన్న డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు. అయితే ఇందులో రైడ్-బై-వైర్ థొరెటల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండటం విశేషం. బరువు విషయానికి వస్తే ట్రయంఫ్ (179 కేజీలు) గెరిల్లా (185 కేజీలు) కంటే కాస్త తేలికగా ఉంటుంది, దీనివల్ల సిటీ ట్రాఫిక్ లో నడపడం ఈజీ అవుతుంది.
చివరగా డిజైన్ గురించి చెప్పాలంటే.. గెరిల్లా 450 చాలా రగ్గడ్‌గా, వెడల్పాటి టైర్లతో బలిష్టంగా కనిపిస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 మాత్రం చాలా నీట్ గా, ప్రీమియం ఫినిషింగ్ తో క్లాస్ లుక్ లో ఉంటుంది. మీకు టెక్నాలజీ, భారీ లుక్ కావాలంటే గెరిల్లాను, లేదు తక్కువ ధరలో ప్రీమియం బ్రాండ్, తేలికైన బైక్ కావాలంటే ట్రయంఫ్ స్పీడ్ 400ని ఎంచుకోవచ్చు. మొత్తానికి ఈ రెండు బైక్లు కూడా తమదైన శైలిలో మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి.

