Royal Enfield: అడ్వెంచర్ రైడర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్.. కొత్త బైక్‌లో అదిరిపోయే ఫీచర్లు!
అదిరిపోయే ఫీచర్లు!

Royal Enfield: అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 750ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2026 కార్యక్రమంలో ఈ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ హిమాలయన్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన మోడళ్లలో ఇదే అత్యధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4,89,490గా నిర్ణయించారు. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ బైక్ బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
743cc ఇంజిన్.. 63Nm టార్క్
కొత్త హిమాలయన్ 750లో 743cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 7,000 ఆర్పీఎం వద్ద 55 PS పవర్, 5,000 ఆర్పీఎం వద్ద 63Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3,500 ఆర్పీఎం నుంచే గరిష్ఠ టార్క్‌లో 90 శాతం అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. హైవే ప్రయాణాలతో పాటు కొండ ప్రాంతాలు, ఆఫ్‌రోడ్ మార్గాల్లోనూ మెరుగైన పనితీరు అందించేలా ఈ ఇంజిన్‌ను రూపొందించారు.
క్రూయిజ్ కంట్రోల్.. ఐదు రైడింగ్ మోడ్స్
ఈ బైక్‌లో రైడర్లకు ఉపయోగపడే ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. రోడ్, రోడ్ స్పోర్ట్, రెయిన్, ట్రయల్, కస్టమ్.. ఇలా ఐదు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. వీటితో రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్ సెట్టింగ్స్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మారతాయి. క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. 4 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేలో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్, మ్యూజిక్ కంట్రోల్ సదుపాయాలు అందించారు. రెండు టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు కూడా ఉన్నాయి.
ధరలు, వేరియంట్లు.. బుకింగ్స్ ఎప్పటి నుంచి?
హిమాలయన్ 750 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాస్ట్ వీల్ మోడల్ అజ్టెక్ గ్రీన్, టెక్టోనిక్ బ్లాక్ రంగుల్లో రూ.4,89,490 ధరకు వస్తుంది. స్పోక్ వీల్ వేరియంట్ వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ రంగుల్లో రూ.5,14,495కు అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ యాంటార్కిటిక్ సిల్వర్ ధర రూ.6,29,000. ఇందులో GIVIతో కలిసి రూపొందించిన టాప్ బాక్స్, హార్డ్ ప్యానియర్స్, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్ గార్డ్స్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్ లభిస్తాయి. ఈ ధరలన్నీ చెన్నై ఎక్స్‌షోరూమ్ ధరలు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
సస్పెన్షన్, బరువు.. పోటీ ఎవరితో?
హిమాలయన్ 750లో ముందు 43mm షోవా యూఎస్డీ ఫోర్క్స్, వెనుక షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల చక్రాలు ఉంటాయి. 205mm గ్రౌండ్ క్లియరెన్స్, 815mm సీట్ హైట్, 17.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. బైక్ కర్బ్ వెయిట్ 224 కిలోలు. ఈ కొత్త అడ్వెంచర్ బైక్ మార్కెట్లో BMW F 450 GS, హోండా NX500, కవాసాకి వర్సెస్ 650, హోండా XL750 ట్రాన్స్ లాప్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

