Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ గురిల్లా 450 ఎపెక్స్ లాంచ్.. కొత్త ఫీచర్లు, అదిరిపోయే గ్రిప్ ఇచ్చే టైర్లతో ఎంట్రీ
కొత్త ఫీచర్లు, అదిరిపోయే గ్రిప్ ఇచ్చే టైర్లతో ఎంట్రీ

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అడ్వాన్స్‌డ్ రోడ్‌స్టర్ బైక్ గురిల్లా 450లో సరికొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. 2026 మోడల్ ఇయర్ కోసం కంపెనీ కొత్తగా ఫ్లాగ్‌షిప్ ఎపెక్స్ వేరియంట్‌ను పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, అదిరిపోయే ఎర్గోనామిక్స్‌తో వచ్చిన ఈ బైక్ రైడింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. స్టాండర్డ్ వేరియంట్లతో పాటు ఈ ఎపెక్స్ మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ట్రయంఫ్ స్పీడ్ 400 వంటి బైకులకు గట్టి పోటీ ఇచ్చేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని తీర్చిదిద్దింది.
గురిల్లా 450 ఎపెక్స్ వేరియంట్ తన పేరుకు తగ్గట్టుగానే అత్యున్నత ప్రమాణాలతో వచ్చింది. సాధారణ మోడల్‌లో ఉండే సీయెట్ టైర్లకు బదులుగా, ఇందులో ప్రీమియం Vredestein Centuro ST రోడ్-ఓరియెంటెడ్ టైర్లను అమర్చారు. ఇవి పొడి రోడ్లపై 8 శాతం, తడి రోడ్లపై 17 శాతం అదనపు గ్రిప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. దీనివల్ల మూలమలుపుల్లో బైక్ చాలా స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా, రైడింగ్ పొజిషన్ మరింత సౌకర్యవంతంగా ఉండటానికి హ్యాండిల్‌బార్‌ను 56 మిమీ కిందికి, 57 మిమీ ముందుకు జరిపారు. దీనివల్ల లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు రైడర్‌కు అలసట తక్కువగా ఉంటుంది.
ఎపెక్స్ వేరియంట్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. బైక్ బాడీ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా పిలియన్ సీట్ కవర్‌ను కూడా ఇచ్చారు, ఇది బైక్‌కు పక్కా స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. సాధారణంగా ఇవి యాక్సెసరీగా దొరికేవి, కానీ ఎపెక్స్ మోడల్‌లో ఇన్-బిల్ట్‌గా వస్తున్నాయి. హెడ్‌లైట్ పైన చిన్న హుడ్ కూడా అమర్చారు. అయితే, ఎపెక్స్ వేరియంట్‌లో ఫ్రంట్ ఫోర్క్ కవర్లు ఉండవు, దీనివల్ల బైక్ లుక్ చాలా సింపుల్ గా, క్లీన్‌గా కనిపిస్తుంది.
2026 స్టాండర్డ్ గురిల్లా 450లో కూడా చిన్నపాటి అప్‌డేట్స్ జరిగాయి. కొత్తగా బ్లూ కలర్ పెయింట్ ఆప్షన్ చేరింది. వీటితో పాటు హెడ్‌లైట్ గార్డ్, నకిల్ గార్డ్స్, ట్యాంక్ గ్రాఫిక్స్‌ను మరింత స్టైలిష్‌గా మార్చారు. టెక్నాలజీ పరంగా చూస్తే, సర్క్యులర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేలో నేవిగేషన్ మరియు కనెక్టివిటీ ఫీచర్లను అప్‌డేట్ చేశారు. పాత హిమాలయన్, గురిల్లా యజమానులు కూడా ఈ కొత్త ఫీచర్లను OTA (Over-The-Air) అప్‌డేట్ ద్వారా పొందవచ్చు.
డిజైన్ మరియు టైర్లలో మార్పులు చేసినా, నమ్మకమైన ఇంజిన్ పవర్‌ను అలాగే ఉంచారు. ఇందులో 452 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 40 PS పవర్, 40 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లు రైడింగ్‌ను సులభతరం చేస్తాయి. షోవా బిగ్ పిస్టన్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు యథాతథంగా ఉన్నాయి. స్ట్రీట్, స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్స్ కూడా ఇందులో కొనసాగుతున్నాయి.

