Royal Enfield: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత మార్కెట్లో అత్యంత అరుదైన మోడల్‌ను ప్రవేశపెట్టింది. క్లాసిక్ 650 125త్ యానివర్సరీ ఎడిషన్ హైపర్‌షిఫ్ట్ పేరుతో విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.4,25,589గా నిర్ణయించారు. ఈ స్పెషల్ బైక్ కేవలం పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉండనుంది. ప్రతి దేశానికి కేవలం 125 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనివల్ల బైక్ కలెక్టర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది ఒక అరుదైన మైలురాయిగా నిలవనుంది.

రంగులు మారే పెయింట్ టెక్నాలజీ

ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రధాన ఆకర్షణ దీనిలో ఉపయోగించిన హైపర్‌షిఫ్ట్ పెయింట్ టెక్నాలజీ. బైక్‌పై పడే వెలుగు అలాగే మనం చూసే యాంగిల్ ఆధారంగా దీని రంగు ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగుల మధ్య మారుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో విక్రయించిన పాత క్లాసిక్ రంగుల జ్ఞాపకాలను ప్రతిబింబిస్తూనే, ఆధునిక డిజైన్ శైలిని జోడించి దీనిని రూపొందించారు. 1901 నాటి కంపెనీ తొలి బైక్‌ల జ్ఞాపకాలను గుర్తుచేసేలా బ్రాస్ బేస్ ఫినిషింగ్, కస్టమ్ పిన్‌స్ట్రైప్స్, క్విల్టెడ్ లెదర్ సీట్, ప్రత్యేకమైన 125 సంవత్సరాల లోగో లాంటి హంగులను అమర్చారు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డెలివరీ వివరాలు

ఈ అరుదైన బైక్‌ను సొంతం చేసుకోవడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు అక్టోబర్ 28 మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజున ఈ బైక్ అధికారిక విక్రయాలు ప్రారంభమవుతాయి. బుకింగ్స్ పూర్తయిన తర్వాత నవంబర్ 2026 నుంచి కస్టమర్లకు వాహనాల డెలివరీలు ప్రారంభించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏర్పాట్లు చేస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేయడం వల్ల ఈ మోడల్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది.

ఇంజిన్ సామర్థ్యం, మెకానికల్ వివరాలు

ఈ డిజైన్ అప్‌గ్రేడ్‌లు మినహా బైక్ మెకానికల్ ఫీచర్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. రెగ్యులర్ క్లాసిక్ 650 మోడల్‌లో ఉండే 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను దీనిలో అందించారు. ఇది 46.39 bhp పవర్, 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. ముందు భాగంలో 19 అంగుళాలు, వెనుక భాగంలో 18 అంగుళాల స్పేక్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్సార్బర్లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ కంటే డిజైన్, ఐడెంటిటీకే ప్రాధాన్యత ఇస్తూ ఈ బైక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

Next Story