Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వాడుతున్నారా? ఉచితంగా ఆ పార్ట్ అమర్చి ఇస్తున్న కంపెనీ
ఉచితంగా ఆ పార్ట్ అమర్చి ఇస్తున్న కంపెనీ

Royal Enfield : ప్రముఖ హెవీ బైక్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ 350cc మోడల్ బైక్స్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగా ఒక ముఖ్యమైన పార్ట్‌ను అమర్చి ఇస్తోంది. క్లాసిక్ 350, గోవాన్ క్లాసిక్ 350, హంటర్ 350, మీటియోర్ 350 మోడల్స్ ఉపయోగిస్తున్న కస్టమర్లు ఈ ఉచిత సదుపాయాన్ని పొందేందుకు అర్హులు. కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యమిస్తూ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై బైక్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సమస్య ఏంటి? ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు?
ఆగస్టు 2025 తర్వాత తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc బైక్స్‌లో డిస్‌ప్లేపై గేర్ పొజిషన్ ఇండికేటర్‌కు బదులుగా కేవలం న్యూట్రల్ పొజిషన్ ఇండికేటర్ మాత్రమే ఇచ్చారు. గ్లోబల్ మార్కెట్‌లో రేర్ అర్థ్ మెటీరియల్ కొరత ఏర్పడటంతో, గేర్ పొజిషన్ సెన్సార్లలో వాడే మ్యాగ్నెట్‌ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బైక్ డెలివరీలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో కంపెనీ తాత్కాలికంగా కేవలం న్యూట్రల్ ఇండికేటర్‌తోనే వాహనాలను కస్టమర్లకు అందించింది. అయితే, సప్లై చైన్ సమస్యలు తీరగానే కస్టమర్లకు ఉచితంగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌ను ఫిట్ చేస్తామని అప్పట్లో ఇచ్చిన మాటను కంపెనీ ఇప్పుడు నిలబెట్టుకుంటోంది.
ఉచితంగా పార్ట్ ఎలా పొందాలి?
ఈ సేవ కోసం కంపెనీ కస్టమర్ల రూపాయి కూడా తీసుకోదు. పార్ట్ ధరతో పాటు ఫిట్టింగ్ చార్జీలను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థే భరిస్తుంది. బైక్ యజమానులు తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక యాప్ ద్వారా లేదా సమీపంలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి తమ బైక్ ఈ ఉచిత అప్‌గ్రేడ్‌కు అర్హమో కాదో సరిచూసుకోవచ్చు. పార్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కంపెనీ ప్రతినిధులు నేరుగా వాహనదారులను సంప్రదించి ఉచితంగా అమర్చి ఇస్తున్నారు.
రేర్ అర్థ్ సమస్య.. భారత్ ముందున్న సవాళ్లు
ఎలక్ట్రానిక్ విడిభాగాలలో కీలకమైన రేర్ అర్థ్ పార్ట్స్ కొరత తగ్గించడానికి భారత్, అమెరికా, జపాన్, అర్జెంటీనా వంటి దేశాలతో సుదీర్ఘ ఒప్పందాలు చేసుకుంది. భారత్‌లో రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, స్థానికంగా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

