జేబుకు చిల్లు పడాల్సిందే

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు చేదువార్త. తన ఐకానిక్ బైక్‌లు అయిన బుల్లెట్ 350, క్లాసిక్ 350 ధరలను కంపెనీ పెంచింది. ముడిసరుకు ఖర్చులు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గతేడాది పండుగ సీజన్‌కు ముందు జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గించిన కంపెనీ, ఇప్పుడు కొత్త ఏడాదిలో మళ్లీ పెంచడం గమనార్హం.

బుల్లెట్ 350

ఏ వేరియంట్ పై ఎంత పెరిగింది? రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు వేరియంట్‌ను బట్టి రూ.1,628 నుంచి రూ.2,025 వరకు పెరిగాయి.

బ్లాక్ గోల్డ్: ఈ టాప్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.2,025 పెరిగింది. దీని కొత్త ధర సుమారు రూ.2,04,434 (ఎక్స్-షోరూమ్).

బటాలియన్ బ్లాక్ : దీనిపై రూ.1,632 పెరగడంతో కొత్త ధర రూ.1,63,793కి చేరింది.

మిలిటరీ రెడ్ : అదృష్టవశాత్తూ ఈ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఇప్పటికీ పాత ధరకే లభిస్తోంది.

క్లాసిక్ 350

క్లాసిక్ 350 మోడల్‌పై రూ.1,540 నుంచి రూ.1,835 వరకు ధర పెరిగింది.

ఎమరాల్డ్ : ఈ ప్రీమియం వేరియంట్‌పై గరిష్టంగా రూ.1,835 పెరిగింది.

రెడిచ్ రెడ్ : దీనిపై అతి తక్కువగా రూ.1,540 పెరిగింది. ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.1,82,658 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ధరలు పెరిగినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో మాత్రం దూసుకుపోతోంది. డిసెంబర్ 2025లో కంపెనీ దేశీయంగా 93,177 బైక్‌లను విక్రయించింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 37 శాతం ఎక్కువ. మొత్తం అంతర్జాతీయ అమ్మకాలు కలిపితే డిసెంబర్‌లో కంపెనీ 1,03,574 యూనిట్ల మార్కును దాటింది. అయితే ఎగుమతుల్లో మాత్రం స్వల్పంగా 10 శాతం తగ్గుదల నమోదైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన లైనప్‌ను భారీగా విస్తరిస్తోంది. 2026 మధ్య నాటికి కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ను భారత్‌లో లాంచ్ చేయనుంది. అలాగే 2026 చివరలో అడ్వెంచర్ ప్రియుల కోసం హిమాలయన్ 750ను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story