రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై ఊహించని డిస్కౌంట్

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లవర్స్‌కి ఇది ఒక గుడ్ న్యూస్. ఇటీవల ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో కోత విధించడంతో, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీ మోటార్‌సైకిళ్లు, సర్వీసులు, దుస్తులు, యాక్సెసరీస్ ధరలు కూడా తగ్గుతాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం భారతదేశంలోని రైడర్లకు 350సీసీ మోటార్‌సైకిళ్లను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ లైన్‌అప్ ఎప్పటినుంచో కంపెనీకి ఒక మంచి గుర్తింపుగా ఉంది. కొత్త ధరల వల్ల ఈ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్ల ప్రజాదరణ మరింత పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. సెప్టెంబర్ 22, 2025 నుంచి ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో అమలులోకి వస్తాయి. ఈ బైక్‌ల ధరలు సుమారు రూ. 22,000 వరకు తగ్గనున్నాయి. త్వరలోనే మోడల్ వారీగా కొత్త ధరల జాబితాను కంపెనీ విడుదల చేయనుంది.

హంటర్ 350 మోడల్‌పై రూ.14,990 వరకు తగ్గింపు లభిస్తుంది. క్లాసిక్ 350 బైక్ ధర రూ.20,000 వరకు తగ్గనుంది. మీటియర్ 350 మోడల్‌పై కూడా రూ.20,000 తగ్గింపు ఉంటుంది. బుల్లెట్ 350 ఐకానిక్ బైక్ ధర రూ.17,000 వరకు తగ్గనుంది. గోవాన్ క్లాసిక్ 350 మోడల్‌పై అత్యధికంగా రూ.22,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఐషర్ మోటార్స్ లిమిటెడ్ ఎండీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల వల్ల కొత్తగా బైక్ కొనే వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ జీఎస్టీ సంస్కరణ వల్ల 350సీసీ వరకు ఉన్న మోటార్‌సైకిళ్లు మరింత అందుబాటులోకి వస్తాయి. కొత్త రైడర్లు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ కుటుంబంలో చేరవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బలం 350సీసీ బైక్‌లలో ఉన్నప్పటికీ, కంపెనీకి చాలా పెద్ద మోడల్స్ ఉన్నాయి. స్క్రమ్ 440, గెరిల్లా 450, హిమాలయన్ 450తో పాటు 650సీసీ సిరీస్‌లోని ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, క్లాసిక్, షాట్‌గన్, సూపర్ మీటియర్ వంటి బైక్‌ల ధరలు మాత్రం పెరుగుతాయి. ఎందుకంటే 350సీసీ కంటే ఎక్కువ ఉన్న బైక్‌లపై జీఎస్టీ రేటు పెరుగుతుంది. దీంతో ఈ బైక్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story