Safe Night Driving Tips : నైట్ డ్రైవింగ్ అంటే భయమా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం సేఫ్ అండ్ హ్యాపీ
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం సేఫ్ అండ్ హ్యాపీ

Safe Night Driving Tips : పగటిపూట కారు నడపడం ఒక ఎత్తు అయితే, రాత్రివేళ డ్రైవింగ్ చేయడం మరో ఎత్తు. తక్కువ వెలుతురు, ఎదురుగా వచ్చే వాహనాల హైబీమ్ లైట్లు, రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చే మలుపులు లేదా జంతువులు డ్రైవర్లను ఒత్తిడికి గురిచేస్తాయి. చాలామందికి రాత్రిపూట లాంగ్ డ్రైవ్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. కానీ, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ నైట్ డ్రైవింగ్‌ను అత్యంత సురక్షితంగా, ఎంజాయ్ చేస్తూ సాగించవచ్చు.
అద్దాలు, లైట్ల శుభ్రత చాలా ముఖ్యం
రాత్రిపూట ప్రయాణం మొదలుపెట్టే ముందు మీ కారు హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఇండికేటర్లను ఒకసారి తడి గుడ్డతో తుడవండి. వాటిపై పేరుకుపోయిన ధూళి వల్ల వెలుతురు తగ్గి రోడ్డు సరిగ్గా కనిపించదు. అదేవిధంగా, విండ్‌షీల్డ్ (ముందు అద్దం), సైడ్ మిర్రర్లను నీట్ గా ఉంచుకోవాలి. అద్దంపై జిడ్డు లేదా దుమ్ము ఉంటే, ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు ఆ అద్దంపై పడి వెదజల్లబడుతుంది, దీనివల్ల మీకు రోడ్డుపై ఉన్న గుంతలు లేదా అడ్డంకులు కనిపించవు.
హైబీమ్ వాడకంలో తెలివి ప్రదర్శించండి:
చాలామంది హైవేలపై వెళ్తున్నప్పుడు ఎప్పుడూ హైబీమ్ ఆన్‌లోనే ఉంచుతారు. ఇది చాలా ప్రమాదకరం. ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్నప్పుడు వెంటనే లోబీమ్కి మారండి. మీ కారు లైట్ల వేడి ఎదుటి డ్రైవర్ కళ్లను మిరిమిట్లు గొలిపి, అతనికి ఏమీ కనిపించకుండా చేస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేవలం నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై, ఎదురుగా ఎవరూ లేనప్పుడు మాత్రమే హైబీమ్ వాడాలి.
కారు లోపల వెలుతురు తగ్గించండి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు లోపల కేబిన్ లైట్లను ఆన్ చేయకూడదు. కారు లోపల వెలుతురు ఎక్కువగా ఉంటే, బయట ఉన్న చీకటికి మీ కళ్లు అలవాటు పడవు. అలాగే లోపల లైట్ వెలుగు విండ్‌షీల్డ్ అద్దంపై ప్రతిబింబించి బయట దృశ్యం మసకగా కనిపించేలా చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లోని స్పీడోమీటర్ వంటి లైట్లను కూడా కళ్లకు ఇబ్బంది కలగని రీతిలో డిమ్ గా ఉంచుకోవడం మంచిది.
దూరం పాటించండి.. వేగాన్ని నియంత్రించండి
పగటిపూట కంటే రాత్రిపూట వాహనాల మధ్య దూరాన్ని అంచనా వేయడం కొంచెం కష్టం. కాబట్టి మీ ముందు వెళ్తున్న వాహనానికి, మీకు మధ్య సాధారణం కంటే కొంచెం ఎక్కువ దూరం ఉండేలా చూసుకోకండి. దీనివల్ల ముందు వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, మీరు స్పందించడానికి తగిన సమయం ఉంటుంది. అలాగే వేగాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల అనుకోని అడ్డంకులు ఎదురైనప్పుడు కారును సురక్షితంగా ఆపవచ్చు. అలసటగా ఉన్నప్పుడు లేదా నిద్ర వస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయకుండా, కాసేపు ఆగి టీ తాగి లేదా ముఖం కడుక్కుని ప్రయాణాన్ని కొనసాగించడం ఉత్తమం.

