Safety Hatchbacks: ప్రస్తుత రోజుల్లో కొత్త కారు కొనేవాళ్లు కేవలం వాహనం ధర, మైలేజ్ లేదా ఆకర్షణీయమైన ఫీచర్లను మాత్రమే చూడటం లేదు. కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తూ కార్ల క్రాష్ టెస్ట్ రేటింగ్‌లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంత బలమైన బాడీ బిల్డ్ ఉంది, అత్యవసర సమయాల్లో కారు ఎంతవరకు రక్షణ ఇస్తుందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అన్నింటికీ భద్రతలో ఒకే విధమైన రేటింగ్ లభించలేదు. కొన్ని చిన్న కార్లు 5-స్టార్ సేఫ్టీ సాధించి నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి.

5-స్టార్ రేటింగ్‌తో టాటా ఆల్ట్రోజ్

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాటా ఆల్ట్రోజ్ భద్రత పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ కారు అంతర్జాతీయ గ్లోబల్ ఎన్‌క్యాప్‎తో పాటు మన దేశానికి చెందిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దృఢమైన బాడీ నిర్మాణం, ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఇచ్చే రక్షణ విషయంలో ఆల్ట్రోజ్ బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లాంటి విభిన్న ఇంధన ఆప్షన్లలో లభిస్తుండటంతో, ప్రీమియం లుక్‌తో పాటు భద్రత కోరుకునే వారికి ఇది మొదటి ఎంపికగా మారుతోంది.

అదరగొడుతున్న టాటా పంచ్

హ్యాచ్‌బ్యాక్ సైజులో ఉంటూ ఎస్‌యూవీ లుక్ ఇచ్చే టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కాంపాక్ట్ సైజులో ఉన్నప్పటికీ, భద్రత విషయంలో ఏమాత్రం తగ్గకుండా గ్లోబల్ ఎన్‌‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది. నగరాల్లోని రద్దీ వీధుల్లో సులభంగా నడపడానికి, ఎత్తైన సీటింగ్ పొజిషన్ ద్వారా స్పష్టమైన డ్రైవింగ్ వ్యూ పొందడానికి ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతుంది. బడ్జెట్ పరిధిలో ఉంటూనే గరిష్ట రక్షణ కోరుకునే చిన్న కుటుంబాలకు టాటా పంచ్ ఒక రోడ్‌మాస్టర్‌లా నిలుస్తోంది.

మిగిలిన పాపులర్ కార్ల పరిస్థితి ఏమిటి?

మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా టియాగో కార్ల విషయానికి వస్తే వీటి భద్రతా ప్రమాణాలు విభిన్నంగా ఉంటాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో లభించే టాటా టియాగో గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. మరోవైపు మారుతి స్విఫ్ట్ అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కోసం ప్రసిద్ధి చెందగా, మారుతి బాలెనో విశాలమైన కేబిన్ స్పేస్, మోడర్న్ ఫీచర్లకు పేరుగాంచింది. హ్యుందాయ్ ఐ20 తన స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్‌తో మెప్పిస్తోంది. అయితే ఈ మోడళ్లు సేఫ్టీ టెస్టుల్లో 5-స్టార్ సాధించిన ఆల్ట్రోజ్, పంచ్ కార్లతో సమానమైన రేటింగ్ కలిగి లేవు.

కారు ఎంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొత్త కారును ఎంపిక చేసుకునే క్రమంలో కేవలం ఒక్క రేటింగ్ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు. మీ రోజువారీ వినియోగం, కేటాయించే బడ్జెట్, ఆశించే మైలేజ్, అవసరమైన ఫీచర్లు, రీసేల్ వాల్యూ వంటి అన్ని కోణాలను సమగ్రంగా విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి రోజూ ప్రయాణించే వారు ఎయిర్‌‌బ్యాగ్‌ల సంఖ్య, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం మంచిది. సరైన పరిశోధన చేసి కొనుగోలు చేసే వాహనమే దీర్ఘకాలంలో ప్రయాణాన్ని సురక్షితంగా, ఆనందదాయకంగా మారుస్తుంది.

Next Story