11,500 కార్లు రీకాల్ చేసిన టయోటా

Toyota Recall : టయోటా ఇండియా తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కోసం స్వచ్ఛందంగా రీకాల్‌ను ప్రకటించింది. కారులోని ఎనలాగ్ ఫ్యూయెల్ లెవల్ ఇండికేటర్ లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉన్నందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సమాచారం ప్రకారం, డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన దాదాపు 11,529 హైరైడర్ యూనిట్లను తనిఖీ కోసం కంపెనీ తిరిగి పిలవనుంది.

కొన్ని హైరైడర్ ఎస్‌యూవీలలో ఫ్యూయెల్ గేజ్ సరైన పెట్రోల్ స్థాయిని చూపడం లేదని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా లో-ఫ్యూయెల్ వార్నింగ్ లైట్ (తక్కువ పెట్రోల్ హెచ్చరిక లైట్) కూడా సమయానికి వెలగడం లేదు. దీనివల్ల డ్రైవర్‌కు ట్యాంక్‌లో పెట్రోల్ ఎంత ఉందో తెలియక, కారు అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించడమే కాకుండా, భద్రతకు కూడా ప్రమాదకరం. ఇలాంటి ఫిర్యాదులు చాలా తక్కువగా వచ్చాయని టయోటా చెబుతున్నప్పటికీ, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రీకాల్‌ను ప్రకటించింది.

రీకాల్ ప్రక్రియలో భాగంగా, లోపం ఉన్న హైరైడర్ కార్ల యజమానులందరినీ టయోటా నేరుగా సంప్రదిస్తుంది.వారి రిజిస్టర్డ్ డీలర్‌షిప్‌కు ఆహ్వానిస్తుంది. డీలర్‌షిప్‌లోని టెక్నీషియన్లు కారులోని కాంబినేషన్ మీటర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తనిఖీలో ఏదైనా లోపం ఉన్నట్లు తేలితే, ఆ భాగాన్ని పూర్తిగా ఉచితంగా కొత్త దానితో మారుస్తారు. ఈ ప్రక్రియ కోసం కస్టమర్లు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. డీలర్‌షిప్‌లు నేరుగా కస్టమర్లను సంప్రదించినప్పటికీ, కార్ యజమానులు తమ VIN (Vehicle Identification Number) నంబర్‌ను ఉపయోగించి, కంపెనీ రీకాల్ వెబ్‌సైట్‌లో తమ కారు ఈ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

ఈ సమస్యలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల మారుతి సుజుకి గ్రాండ్ విటారా 39,506 యూనిట్లను కూడా ఇదే ఫ్యూయెల్ ఇండికేటర్ సమస్య కారణంగా రీకాల్ చేశారు. హైరైడర్, గ్రాండ్ విటారా మోడళ్లు టయోటా-మారుతి భాగస్వామ్యం కింద తయారు చేయబడినవే. ఈ రెండు మోడళ్లు అనేక మెకానికల్, ఎలక్ట్రానిక్ భాగాలను పంచుకుంటాయి. అందుకే ఈ రెండు కార్లలోనూ ఒకే విధమైన ఫ్యూయెల్ ఇండికేటర్ లోపం బయటపడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story