ప్రీమియం ఇంటీరియర్స్‌తో క్రెటాకు సవాల్!

Kia Seltos : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అసలైన పోటీ మొదలుకానుంది. సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్ డిసెంబర్ 10, 2025న బెంగళూరులో జరగబోయే ఈవెంట్‌లో లాంచ్ కానుంది. కియా ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌లలో ఈ కారులో భారీ డిజైన్ మార్పులు చూపించింది. ఈ కొత్త సెల్టోస్ మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, కొత్త టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త 2026 కియా సెల్టోస్‌కు పూర్తిగా కొత్త ఫ్రంట్ లుక్ లభిస్తుంది. ఇందులో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త డీఆర్‌ఎల్ డిజైన్, మరింత ఉబ్బెత్తుగా కనిపించే బంపర్, మస్క్యులర్ బోనెట్ ఉంటాయి. ఇది ప్రస్తుత మోడల్ కంటే మరింత బాక్సీగా, నిటారుగా కనిపిస్తుంది. వెనుక వైపు చూస్తే కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు, జియోమెట్రిక్ డిజైన్ కలిగిన టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. ఈ టెయిల్ ల్యాంప్‌లను కలుపుతూ మధ్యలో ఒక లైట్ బార్ ఉంటుంది. ఇది కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.

కొత్త సెల్టోస్ పరిమాణంలో కూడా పాత మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ప్రస్తుత మోడల్ పొడవు 4365 మి.మీ., వెడల్పు 1800 మి.మీ., ఎత్తు 1645 మి.మీ. ఉంది. అంటే, 2026 మోడల్ రోడ్డుపై మరింత శక్తివంతంగా కనిపించడమే కాకుండా, కారు లోపల ప్రయాణికులకు ఎక్కువ స్థలం కూడా లభిస్తుంది.

సైజుతో పాటు, కొత్త సెల్టోస్ ఫీచర్ల విషయంలో కూడా అప్‌డేట్ అయింది. ఇంటీరియర్‌లో బ్లాక్, బీజ్ డ్యూయల్-టోన్ కలయిక లభిస్తుంది, ఇది క్యాబిన్‌కు మరింత లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది. ఇందులో కొత్త మూడు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కియా సిరోస్ తరహాలో, కొత్త సెల్టోస్‌లో కర్వ్డ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఇంటీరియర్ అప్‌డేట్స్‌లో కొత్త డ్యాష్‌బోర్డ్, కొత్త గేర్ సెలెక్టర్, కొత్త హెచ్‌వీఏసీ కంట్రోల్ ప్యానెల్, సన్నని ఏసీ వెంట్స్, యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్స్, కొత్త సెంటర్ కన్సోల్, పెద్ద స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో అప్‌డేట్ చేసిన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)లో మరిన్ని కొత్త భద్రతా ఫీచర్లు చేర్చబడతాయి. ఇంజిన్ల విషయానికి వస్తే కొత్త 2026 కియా సెల్టోస్‌లో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు యథావిధిగా ఉంటాయి. అయితే డీజిల్ ఇంజిన్‌తో ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తొలగించి, కొత్త 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story