బజాజ్ ఈవీ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం?

Bajaj : ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన బజాజ్ ఆటోకు రాబోయే నెలల్లో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం చైనా, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై నిషేధం విధించడమే. రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఎగుమతి నిషేధం వల్ల మోటార్లు తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకు సరైన సమయానికి లభించడం లేదు. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్, ఆగస్టు 2025లో తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించారు.

ప్రస్తుతం బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటీవల విడుదల చేసిన గోగో ఈ-రిక్షాలను ఉత్పత్తి చేస్తోంది. అయితే, రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా ఆగిపోవడం వల్ల, తమ వద్ద ఉన్న స్టాక్ అయిపోగానే ఉత్పత్తిని నిలిపివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ చెబుతోంది. పరిస్థితి మెరుగుపడకపోతే, ఆగస్టు నెల కంపెనీకి జీరో ప్రొడక్షన్ మంత్ గా మారవచ్చు.

EV మోటార్లలో ఉపయోగించే మాగ్నెట్లలో 90 శాతం చైనా నుంచే వస్తాయని రాజీవ్ తెలిపారు. చైనా కొత్త విధానం కారణంగా భారతదేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీల సరఫరా గొలుసు ప్రభావితమైందని ఆయన అన్నారు. ఈ తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడానికి సహాయపడే విధంగా ప్రభుత్వ విధానంలో స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సంక్షోభం కేవలం బజాజ్‌కు మాత్రమే పరిమితం కాదు. టీవీఎస్, ఏథర్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి. ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. త్వరలో పరిష్కారం లభించకపోతే దీని ప్రభావం వినియోగదారులపై కూడా పడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story