Skoda : కేవలం 50 మందికి మాత్రమే దక్కే లక్కీ కార్.. స్కోడా సరికొత్త ఎస్‌యూవీ బుకింగ్స్ షురూ
స్కోడా సరికొత్త ఎస్‌యూవీ బుకింగ్స్ షురూ

Skoda : లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ సరికొత్త, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్‌యూవీ స్కోడా కొడియాక్ ఆర్‌ఎస్ను తీసుకువచ్చింది. ఈ కారుకు సంబంధించిన అధికారిక బుకింగ్స్‌ను కూడా కంపెనీ నేటి నుంచి ప్రారంభించింది. అయితే ఈ కారును సాధారణ కార్లలాగా ఎవరంటే వారు కొనేయలేరు. ఎందుకంటే కంపెనీ దీనిని కేవలం లిమిటెడ్ ఎడిషన్ గా మార్కెట్లోకి తెచ్చింది. భారతదేశం మొత్తం మీద కేవలం 50 యూనిట్లను మాత్రమే వినియోగదారుల కోసం విక్రయించనుంది. ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారు రూ.3 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి ముందే బుక్ చేసుకోవచ్చు.
5 దశాబ్దాల ఘనమైన చరిత్ర
ఈ సరికొత్త కొడియాక్ ఆర్‌ఎస్ లాంచ్ వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉంది. స్కోడా కంపెనీకి చెందిన అత్యంత ప్రసిద్ధమైన, స్పోర్టీ పెర్ఫార్మెన్స్ ఇచ్చే RS బ్యాజ్ మార్కెట్లోకి వచ్చి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు దశాబ్దాల గోల్డెన్ జూబ్లీ వేడుకల సంబరాల్లో భాగంగానే కంపెనీ ఈ ప్రత్యేకమైన కారును ఇండియాకు పరిచయం చేసింది. ఈ కారు లుక్ చూసిన వెంటనే దీని స్పోర్టీ ఐడెంటిటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్‌యూవీ ఫ్రంట్ గ్రిల్ ఫ్రేమ్, విండో ట్రిమ్, ఓఆర్‌వీఎంలు, రూఫ్ రైల్స్, డి-పిల్లర్లకు అదిరిపోయే బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కారుకు మరింత అగ్రెసివ్, రౌడీ లుక్‌ను తెచ్చిపెట్టింది.
ప్రీమియం ఇంటీరియర్, కలర్ ఆప్షన్లు
కారు లోపలి భాగం కూడా అత్యంత విలాసవంతంగా డిజైన్ చేయబడింది. కేబిన్ లోపల ప్రీమియం బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీతో పాటు సీట్లకు రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఇచ్చారు. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కారుకు అల్ట్రా-లగ్జరీ, స్పోర్టీ ఫీల్‌ను అందిస్తుంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును మూన్ వైట్, మ్యాజిక్ బ్లాక్, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే వంటి 4 లగ్జరీ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
కళ్లు చెదిరే ఇంజిన్ పవర్, టాప్ స్పీడ్
కొత్త కొడియాక్ ఆర్‌ఎస్ లో అత్యంత పవర్‌ఫుల్ 2.0-లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 bhp పవర్‌ను, 400 Nm టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అధునాతన 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు. అంతేకాదు, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఇంజిన్ పవర్‌ను కారు నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. కంపెనీ అంచనాల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇప్పటివరకు భారతదేశంలో లాంచ్ అయిన స్కోడా కార్లన్నింటిలోకి ఇదే అత్యంత వేగవంతమైన కారు. దీని టాప్ స్పీడ్ గంటకు 231 కిలోమీటర్లు. ఇందులో ఉండే డైనమిక్ సౌండ్ బూస్ట్ ఫీచర్ వల్ల ఇంజిన్ బేస్ సౌండ్ వినడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
రోడ్లపై అదిరిపోయే హ్యాండ్లింగ్, కంట్రోల్
స్కోడా కంపెనీ ఈ కారును కేవలం వేగం కోసమే కాకుండా, రోడ్డుపై వెళ్లేటప్పుడు డ్రైవర్‌కు పూర్తి కంట్రోల్ ఉండేలా రీ-డిజైన్ చేసింది. ఇందులో ప్రోగ్రెసివ్ స్టీరింగ్ ను ఇచ్చారు. దీనివల్ల తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు కారును చాలా ఈజీగా యూ-టర్న్ లేదా వంపులు తిప్పవచ్చు, అలాగే హైవేలపై హై-స్పీడ్‌లో వెళ్లేటప్పుడు స్టీరింగ్ గట్టిపడి కారు అదుపు తప్పకుండా ఉంటుంది. దీనితో పాటు సరికొత్త డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ ప్లస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 15 వేర్వేరు డ్యాంపింగ్ లెవెల్స్ ఉంటాయి. దీని ద్వారా డ్రైవర్ తన మూడ్‌కు అనుగుణంగా సస్పెన్షన్‌ను కంఫర్ట్ మోడ్ లేదా స్పోర్ట్స్ మోడ్‌లోకి మార్చుకోవచ్చు.
ప్రతి రోడ్డుకు ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ మోడ్
కొత్త కొడియాక్ ఆర్‌ఎస్ లో డ్రైవింగ్ మోడ్ ఎఫెక్ట్ ఫీచర్ ఉంది. సాఫీగా ఉండే సిటీ రోడ్లు, హైవేల కోసం ఇందులో మొత్తం 6 రెగ్యులర్ రోడ్ మోడ్స్ ఇచ్చారు. ఇవి కాకుండా అడవులు, కొండలు, బురద రోడ్ల కోసం ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ మోడ్ ను కూడా అందించారు. మనం ఎంచుకునే ప్రతి మోడ్‌ను బట్టి కారు యొక్క సస్పెన్షన్, ఇంజిన్ రెస్పాన్స్, గేర్ షిఫ్టింగ్ పూర్తిగా మారిపోతాయి. దేశంలో కేవలం 50 యూనిట్లు మాత్రమే ఉండటం వల్ల ఈ కారుకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. రేసింగ్ కార్ల లాంటి పవర్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు కోరుకునే కోటీశ్వరులకు ఈ కారు ఒక బెస్ట్ కలెక్షన్ అని చెప్పవచ్చు.

