Skoda Kushaq Facelift : సెగ్మెంట్‌లోనే తొలిసారి వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్.. స్కోడా కుషాక్ కొత్త లుక్ మార్చి 21న రివీల్
స్కోడా కుషాక్ కొత్త లుక్ మార్చి 21న రివీల్

Skoda Kushaq Facelift : భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు స్కోడా తన పాపులర్ మోడల్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను సిద్ధం చేసింది. మార్చి 21, 2026న ఈ కొత్త కారు అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో కేవలం బాహ్య రూపమే కాకుండా, కారు లోపల కూడా విప్లవాత్మక మార్పులు చేసింది. ముఖ్యంగా హుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేలా స్కోడా దీనిని తీర్చిదిద్దింది. కస్టమర్ల నమ్మకాన్ని పెంచేలా 4 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో పాటు 6 ఏళ్ల వరకు పొడిగించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది.
మెకానికల్ పరంగా చూస్తే స్కోడా కుషాక్ 2026 లో కీలక మార్పులు జరిగాయి. 115 బీహెచ్‌పీ పవర్ ఇచ్చే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌కు ఇప్పుడు పాత 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (150 బీహెచ్‌పీ) యథావిధిగా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం 1.5 లీటర్ వేరియంట్లలో వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేక్స్ అందించడం ఒక గొప్ప విశేషం.
ఇక లోపల ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్‌ను పరిచయం చేశారు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్ కారుకు రాజసాని ఇస్తాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 6-స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని బోర్ కొట్టనివ్వవు. లగేజీ కోసం బూట్ స్పేస్‌ను ఏకంగా 106 లీటర్లు పెంచి 491 లీటర్లకు చేర్చారు, ఇది లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరం.
డిజైన్ విషయానికి వస్తే, స్కోడా తన మోడరన్ సాలిడ్ ఫిలాసఫీని ఇందులో వాడింది. కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, వెనుక వైపు వెలుగులీనే SKODA అక్షరాలు, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. కస్టమర్లు తమ అభిరుచికి తగ్గట్టుగా సిమ్లా గ్రీన్, చెర్రీ రెడ్, స్టీల్ గ్రే వంటి సరికొత్త రంగులను ఎంచుకోవచ్చు. మొత్తానికి స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ అటు లగ్జరీని, ఇటు పర్ఫార్మెన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది.

