Skoda Kushaq vs Tata Curvv : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా స్టైల్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం సరికొత్త 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టాటా కర్వ్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ఒకవైపు జర్మన్ టెక్నాలజీతో డ్రైవింగ్ ప్రియులను ఆకట్టుకునే కుషాక్ ఉంటే, మరోవైపు అదిరిపోయే కూపే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో టాటా కర్వ్ పోటీకి నిలిచింది. ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి రావాలి? ఏది అసలైన గేమ్ ఛేంజరో వివరంగా తెలుసుకుందాం.

మొదట జేబుపై పడే భారం గురించి మాట్లాడుకుంటే, టాటా కర్వ్ ఇక్కడ ఒక అడుగు ముందుంది. టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.9.7 లక్షల నుంచి ఉండగా, స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ దాదాపు రూ.10.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే బేస్ వేరియంట్‌లో కర్వ్ లక్ష రూపాయల వరకు తక్కువగా లభిస్తుంది. అయితే టాప్ వేరియంట్ విషయానికి వస్తే టాటా కర్వ్ (రూ.19.10 లక్షలు) కంటే కుషాక్ (రూ.18.99 లక్షలు) కొంచెం తక్కువకే దొరుకుతుంది. అంటే ఎంట్రీ లెవల్ లో టాటా, ప్రీమియం లెవల్ లో స్కోడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

చూడటానికి టాటా కర్వ్ చాలా పెద్దదిగా, రోడ్డుపై ఒక గంభీరమైన లుక్ ఇస్తుంది. పొడవు, వెడల్పు, ఎత్తులో కుషాక్ కంటే కర్వ్ పెద్దది. ముఖ్యంగా కర్వ్ లో 500 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది, ఇది కుషాక్ (385 లీటర్లు) కంటే చాలా ఎక్కువ. అయితే, కారు లోపల కూర్చునే వారికి మాత్రం స్కోడా కుషాక్ అద్భుతమైన స్పేస్ ఇస్తుంది. ఎందుకంటే కుషాక్ వీల్‌బేస్ (2651 మిమీ) కర్వ్ కంటే 91 మిమీ ఎక్కువగా ఉంది. దీనివల్ల వెనుక కూర్చునే వారికి కాలు పెట్టుకోవడానికి కుషాక్ లో ఎక్కువ స్థలం దొరుకుతుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్కోడా కుషాక్ రారాజు అని చెప్పాలి. ఇందులో ఉన్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్ టీఎస్ఐ ఇంజిన్ ఏకంగా 150 పీఎస్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. వేగంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పైగా కుషాక్ లో కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు టాటా కర్వ్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండటం ఒక ప్లస్ పాయింట్. కర్వ్ లోని 1.2 లీటర్ టీ-జీడీఐ ఇంజిన్ 125 పీఎస్ పవర్ ఇస్తుంది. భారీ పవర్ కావాలంటే కుషాక్, తక్కువ ఖర్చుతో కూడిన డీజిల్ ప్రయాణం కావాలంటే కర్వ్ ఎంచుకోవచ్చు.

డిజైన్ పరంగా ఈ రెండు కార్లు వేర్వేరు ధృవాలు. కుషాక్ క్లాసిక్ ఎస్‌యూవీ లుక్ తో ఉంటే, కర్వ్ సరికొత్త ఎస్‌యూవీ కూపే డిజైన్ తో అందరినీ ఆకర్షిస్తోంది. కలర్స్ విషయంలో స్కోడా వారు షిమ్లా గ్రీన్, లావా బ్లూ వంటి రాయల్ రంగులను అందిస్తున్నారు. టాటా వారు కార్బన్ బ్లాక్, గోల్డ్ ఎసెన్స్ వంటి స్టైలిష్ కలర్స్ తో మెరిపిస్తున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే టాటా కర్వ్ లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. కుషాక్ లో క్వాలిటీ, బిల్డ్ మెటీరియల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

మీరు డ్రైవింగ్ ను ఎంజాయ్ చేసేవారు, స్పీడ్, క్వాలిటీ బిల్డ్ కావాలనుకునే వారైతే స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మీకు సరైన జోడి. అలా కాకుండా మీకు ఫ్యూచరిస్టిక్ లుక్ ఉండాలి, డీజిల్ ఆప్షన్ కావాలి, డిక్కీలో ఎక్కువ సామాను పట్టాలి అనుకుంటే కళ్ళు మూసుకుని టాటా కర్వ్ ని ఎంచుకోవచ్చు. మొత్తానికి ఒకరు పవర్ లో తోపు అయితే, మరొకరు ఫీచర్లలో కింగ్.

PolitEnt Media

PolitEnt Media

Next Story