Skoda Kushaq vs Volkswagen Taigun : ఒకే ఇంజన్, ఒకే ప్లాట్‌ఫారమ్.. కానీ ఇద్దరు వేర్వేరు కింగ్‌లు. భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ రెండూ ఒకే తల్లి బిడ్డల్లాంటివి (ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యాయి) అయినా, 2026 ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో ఈ రెండింటి మధ్య తేడాలు మరింత పెరిగాయి. కొత్త హంగులతో మెరిసిపోతున్న ఈ రెండింటిలో మీ ఇంటికి ఏది తెచ్చుకుంటే బాగుంటుందో చూద్దాం.

డిజైన్, కలర్ ఆప్షన్లు

2026 ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లో భాగంగా ఈ రెండు ఎస్‌యూవీల బాహ్య రూపంలో కీలక మార్పులు జరిగాయి. లావా బ్లూ, కార్బన్ స్టీల్, క్యాండీ వైట్ వంటి రంగులు రెండింటిలోనూ కామన్‌గా ఉన్నప్పటికీ, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మాత్రం కార్బన్ స్టీల్ మ్యాట్ రంగుతో మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. కుషాక్‌తో పోలిస్తే టైగన్ కొంచెం ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.

ఫీచర్ల యుద్ధం

ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారవ్వడం వల్ల చాలా ఫీచర్లు సమానంగా ఉన్నాయి. 17-అంగుళాల అలాయ్ వీల్స్, ఆరు ఎయిర్ బ్యాగులు (స్టాండర్డ్), 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి రెండింటిలోనూ లభిస్తాయి. అయితే, స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని అదనపు ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, వెనుక సీటు ప్రయాణికుల కోసం మసాజర్ ఫీచర్‌ను కూడా జోడించారు. దూర ప్రయాణాలు చేసే వారికి కుషాక్ మరింత సౌకర్యాన్ని ఇస్తుంది.

ఇంజన్, పర్ఫార్మెన్స్ అప్‌డేట్స్

మెకానికల్ పరంగా చూస్తే, ఈ రెండింటిలోనూ 1-లీటర్ టర్బో పెట్రోల్ (115 PS పవర్, 178 Nm టార్క్), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ (150 PS పవర్, 250 Nm టార్క్) ఇంజన్లు ఉన్నాయి. అయితే 2026 మోడళ్లలో 1-లీటర్ ఇంజన్‌తో పాటు పాత ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు బదులుగా కొత్తగా 8-స్పీడ్ ఏటీ (AT) గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఇది డ్రైవింగ్ అనుభూతిని మరింత స్మూత్‌గా మారుస్తుంది. 1.5-లీటర్ వేరియంట్లలో మాత్రం అదే ఫేమస్ 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్ కొనసాగుతోంది.

ధరల వ్యత్యాసం

ధర విషయంలో స్కోడా కుషాక్ కొంచెం ముందుందని చెప్పాలి. 2026 కుషాక్ ధరలు రూ. 10.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.99 లక్షల వరకు ఉన్నాయి. అదే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 11.42 లక్షల నుంచి టాప్ ఎండ్ రూ. 19.19 లక్షల వరకు ఉంది. టైగన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ కుషాక్ కంటే దాదాపు రూ. 70 వేలు ఎక్కువ. లగ్జరీ, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారు టైగన్ వైపు చూస్తుంటే, వాల్యూ ఫర్ మనీ, అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు కుషాక్ వైపు మొగ్గు చూపుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story