Skoda Kylaq : కైలాక్ కొనాలనుకుంటున్నారా? ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందో తెలుసా ?
ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందో తెలుసా ?

Skoda Kylaq :స్కోడా ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన మోడల్ కైలాక్. భారతీయ రోడ్లకు, ఇక్కడి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఈ కారును రూపొందించారు. అయితే, ఇప్పుడు వివిధ వేరియంట్ల ధరలను కంపెనీ సవరించింది. సిగ్నేచర్, సిగ్నేచర్+ వేరియంట్లపై గరిష్టంగా రూ.33,000 వరకు ధర పెరిగింది. ఇది అటు మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లు రెండింటికీ వర్తిస్తుంది. ఇక టాప్ మోడల్ అయిన ప్రిస్టీజ్ వేరియంట్ల ధర సుమారు రూ.24,000 వరకు పెంచారు.
అయితే ఎంట్రీ లెవల్ కారు కొనాలనుకునే వారికి స్కోడా ఒక తీపి కబురు అందించింది. బేస్ వేరియంట్ అయిన కైలాక్ క్లాసిక్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన క్లాసిక్+, ప్రిస్టీజ్+ వేరియంట్ల ధరలు కూడా పాత ధరలకే లభించనున్నాయి. ప్రస్తుతం కైలాక్ ధరలు భారత మార్కెట్లో రూ.7.59 లక్షల నుంచి రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ధరల శ్రేణితో ఇది టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, మారుతీ బ్రెజ్జా వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిస్తోంది.
స్కోడా కైలాక్ ఫీచర్ల పరంగా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది వాహనానికి మంచి పవర్, పికప్‌ను అందిస్తుంది. లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా), ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో స్కోడా ఎప్పుడూ రాజీ పడదు కాబట్టి, ఫ్యామిలీతో ప్రయాణించే వారికి ఇది ఒక సురక్షితమైన ఎంపికగా నిలిచింది.
కైలాక్ అభిమానుల కోసం మరో అద్భుతమైన వార్త ఏమిటంటే, ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ కైలాక్ స్పోర్ట్‌లైన్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది సాధారణ కైలాక్ కంటే మరింత అగ్రెసివ్ లుక్‌తో, స్పోర్టీ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులతో రాబోతోంది. కొత్త ధరల పెంపు తర్వాత కూడా స్కోడా కైలాక్ తన సెగ్మెంట్లో అత్యంత ఆకర్షణీయమైన కారుగా కొనసాగుతోంది.

