Skoda : టాటా, హ్యుందాయ్ కార్లకు గట్టి పోటీ.. స్కోడా నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
స్కోడా నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Skoda : ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లగ్జరీ, పెద్ద సైజ్ ఎస్‌యూవీ కార్ల విభాగంలో గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పుడు ఈ పోటీని మరింత పెంచుతూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఇప్పటికే మంచి పట్టు సాధించిన టాటా సఫారీ ఈవీ, హ్యుందాయ్ రాబోయే ఎలక్ట్రిక్ కార్లకు గట్టి టెన్షన్ ఇస్తూ.. స్కోడా తన సరికొత్త 7-సీటర్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Peaq డిజైన్ స్కెచ్‌లను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు అధికారికంగా లాంచ్ కాకముందే, దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ స్కెచ్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కారు ప్రీమియం లుక్ కార్ల ప్రియుల మనసులను గెలుచుకుంటోంది. కంపెనీ సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ జూన్ 23, 2026 న ఫ్రాన్స్‌లోని మొనెటియర్-మోర్నెక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రదర్శితం కానుంది. విడుదలైన స్కెచ్‌లను గమనిస్తే ఈ కారులో షార్ప్ లైన్స్, అత్యంత బలమైన బాడీ డిజైన్, ఆకట్టుకునే లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
స్కోడా Peaq ఎస్‌యూవీ ముందు భాగం చాలా వినూత్నంగా, మోడ్రన్‌గా డిజైన్ చేయబడింది. ఇందులో చాలా పల్చటి, పవర్‌ఫుల్ T-Shape ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లను అమర్చారు. ఈ హెడ్‌లైట్ల మధ్యలో గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన టెక్-డెక్ ఫేస్, వాటిని కలిపే ఒక అద్భుతమైన లైటింగ్ ఎలిమెంట్ ఉంది. ఇది కారుకు సరికొత్త, ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, కారు ముందు భాగంలో ఉన్న వోల్కనో-స్టైల్ బంపర్, వెడల్పైన లోయర్ సెక్షన్, క్లీన్ హారిజాంటల్ లైన్స్ ఈ కారుకు రోడ్డుపై తిరుగులేని రాజసాన్ని తెచ్చిపెడతాయి.
ఈ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా రగ్గడ్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో ఎత్తైన షోల్డర్ లైన్, వెడల్పైన డి-పిల్లర్ అందించారు, ఇవి కారుకు మరింత బలాన్ని, లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. కారు బాడీపై ఉన్న షార్ప్ లైన్స్ దీని ఏరోడైనమిక్ డిజైన్‌ను హైలైట్ చేస్తున్నాయి. వీటన్నింటితో పాటు, ఈ కారులో సరికొత్త ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అందించారు. ఇవి కారు బాడీతో పాటు సమానంగా కలిసిపోయి ఉండి, మనం తాకినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఇది కారుకు ఒక అల్ట్రా-మోడ్రన్ టచ్ ఇస్తుంది.
కారు వెనుక భాగం కూడా ముందు డిజైన్‌కు తగ్గట్లే చాలా పర్ఫెక్ట్‌గా సింక్ చేశారు. వెనుక వైపు కూడా T-Shape ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్‌ను అందించారు. ఈ రెండు లైట్లను కలుపుతూ మధ్యలో ఒక కనెక్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. దీనివల్ల కారు వెనుక భాగం విలక్షణమైన లూప్-స్టైల్ డిజైన్‌ను కలిగి ఉండి, రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డుపై చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది.
ఈ సరికొత్త ఈవీ కారు గురించి మీడియా ప్రతినిధులతో స్కోడా ఆటో ఎక్స్‌టీరియర్ డిజైన్ హెడ్ కార్ల్ నెహోల్డ్ కీలక విషయాలు పంచుకున్నారు. ఈ Peaq కారును కంపెనీ సరికొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్ థీమ్ ఆధారంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇందులో క్లీన్ లైన్స్, పర్ఫెక్ట్ బాడీ ప్రొపోర్షన్స్, విలక్షణమైన డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ యుగంలో స్కోడా బ్రాండ్ భవిష్యత్తు గుర్తింపును ఈ కారు సరికొత్తగా ప్రపంచానికి చాటిచెబుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

