కొత్తగా ముస్తాబై రాబోతున్న స్కోడా స్లావియా

Skoda Slavia : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తమ పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ స్లావియా కోసం మిడ్-సైకిల్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం స్కోడా స్లావియా ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో ఉంది. 2026లో లాంచ్‌కు ముందు ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొత్త స్పై ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో డిజైన్ మార్పులతో పాటు కొత్త ఫీచర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అతిపెద్ద అప్‌గ్రేడ్ కానుంది.

టెస్టింగ్ సమయంలో కనిపించిన స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో ముందు, వెనుక భాగాలలో మార్పులు గుర్తించారు. స్కోడా సిగ్నేచర్ గ్రిల్ అలాగే ఉన్నా హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ డిజైన్ కొత్తగా ఉండవచ్చు. ముందు బంపర్ లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన 3డీ లుక్‌తో, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కనిపిస్తోంది. వెనుకవైపు టెయిల్ ల్యాంప్స్, బంపర్‌లో చిన్నపాటి అప్‌డేట్స్ ఆశించవచ్చు.. అయితే బూట్ లిడ్ ఆకారం పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది.

సైడ్ నుంచి చూసినప్పుడు, స్లావియా ఫేస్‌లిఫ్ట్ మొత్తం ప్రొఫైల్ దాదాపు పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. దీని కూపే-స్టైల్ రూఫ్‌లైన్, స్పోర్టీ స్టాన్స్ అలాగే కొనసాగుతాయి. సైడ్ నుంచి కనిపించే అతిపెద్ద మార్పు కొత్త అలాయ్ వీల్స్ కావచ్చు. టెస్ట్ కారులో ఇవి బ్లాక్ ఫినిషింగ్‌తో, కొత్త స్పోక్ డిజైన్‌తో కనిపించాయి. డోర్ హ్యాండిల్స్, బ్లాక్ బి-పిల్లర్, డ్యూయల్-టోన్ ఓఆర్‌వీఎంలు, వీల్ ఆర్చ్ డిజైన్ వంటివి ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లే ఉండే అవకాశం ఉంది.

క్యాబిన్ లోపల, స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. దీనికి అదనంగా అప్‌డేట్ అయిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభించవచ్చు. అయితే ఇందులో అతిపెద్ద హైలైట్ ఏమిటంటే లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ను జతచేయడం. ఈ ఫీచర్లలో లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్‌తో కూడిన ఆటో బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ అలర్ట్ వంటివి ఉండవచ్చు.

ఇంజిన్ ఆప్షన్‌లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో మునుపటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (115 PS పవర్, 178 Nm టార్క్) లభిస్తుంది, దీనికి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది. అలాగే, పవర్ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (150 PS పవర్, 250 Nm టార్క్) 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. 2026లో హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్, వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ వంటి కార్లు కూడా రాబోతున్నందున, మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో పోటీ మరింత తీవ్రంగా మారనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story