Skoda : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటివరకు ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా ప్రవేశపెట్టని ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో.. ఇప్పుడు తన సరికొత్త ఈవీ ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. భారతదేశం కోసం ప్రత్యేకంగా రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్ల ఎంట్రీతో ప్రస్తుతం ఈవీ మార్కెట్లో రారాజులుగా వెలుగుతున్న టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు గట్టి పోటీ ఎదురుకానుంది.

స్కోడా తీసుకురాబోతున్న ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల్లో స్కోడా పీక్ ఈవీ పైనే భారీగా చర్చ జరుగుతోంది. ఇది స్కోడా సంస్థకు చెందిన అంతర్జాతీయ లైనప్‌లోనే అత్యంత విలాసవంతమైన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం అమ్మకాల సంఖ్యను పెంచుకోవడం కంటే, భారతీయ మార్కెట్లో స్కోడా బ్రాండ్ వాల్యూను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రీమియం కారును మనదేశంలో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. భారతీయ వినియోగదారుల లగ్జరీ అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అధునాతన మార్పులు చేస్తున్నారు.

నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో స్కోడా సంస్థకు ఎల్రోక్, ఎన్యాక్ వంటి పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అయినప్పటికీ, భారత్ లాంటి దేశానికి పీక్ ఈవీ సరైన ఆప్షన్ అని కంపెనీ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ఎల్రోక్, ఎన్యాక్ కార్లను నేరుగా విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటే (CBU రూట్ ద్వారా), వాటిపై పడే భారీ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. అందుకే ప్రీమియం కేటగిరీలో బెస్ట్ బ్రాండ్ ఇమేజ్ కోసం పీక్ ఈవీని మొదటి ఛాయిస్‌గా ఎంచుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాల ప్రకారం స్కోడా పీక్ కారును 60, 90, 90x అనే మూడు వేర్వేరు వేరియంట్లలో రూపొందించారు. ఇందులో 63kWh, 91kWh సామర్థ్యం గల రెండు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభిస్తాయి. దీని టాప్ వేరియంట్ అయిన 90x లో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉంటుంది, ఇది ఏకంగా 299 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక మిగిలిన రెండు వేరియంట్లు సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 286 bhp పవర్‌ను ఇస్తాయి. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, కేవలం 27 నుండి 28 నిమిషాల్లోనే దీని బ్యాటరీ 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లుగా ఉంది.

నివేదికల ప్రకారం, భారతదేశం కోసం స్కోడా ప్లాన్ చేస్తున్న రెండవ ఎలక్ట్రిక్ కారు కంపెనీ లేటెస్ట్ గ్లోబల్ మోడల్ స్కోడా ఎపిక్ ఆధారంగా రానుంది. ఇది వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందిన ప్రసిద్ధ MEB+ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతోంది. 4,171 మిమీ పొడవు ఉండే ఈ కారు భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఫీచర్ల పరంగా ఇందులో 13 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఓటీఏ అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సామాన్లు పెట్టుకోవడానికి 475 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తాయి. ఇది లాంచ్ అయితే హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6, మారుతి ఈ విటారాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story