Air Taxi : గంటల ప్రయాణం నిమిషాల్లోనే..భారత్ గగనతలంపై ఎయిర్ టాక్సీల విహారం
భారత్ గగనతలంపై ఎయిర్ టాక్సీల విహారం

Air Taxi : మన దేశంలోని బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ట్రాఫిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలన్నా చుక్కలు కనిపిస్తాయి. గంటల కొద్దీ రోడ్ల మీద నరకం అనుభవించే సామాన్యులకు ఒక అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్ సంస్థ మన ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నడుం బిగించింది. గాలిలో ఎగిరే ఎయిర్ టాక్సీల కలను నిజం చేస్తూ, తాజాగా తన SYL-X1 అనే ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ టెస్టింగ్ పనులను బెంగళూరు వేదికగా ప్రారంభించింది. ఇది కేవలం మాటల్లోనే కాకుండా ఇప్పుడు చేతల్లో కూడా నిరూపిస్తోంది ఈ కంపెనీ.
ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని లోతైన విషయాల్లోకి వెళ్తే సరళ ఏవియేషన్ తయారు చేసిన ఈ SYL-X1 విమానం మామూలు విమానం కాదు. ఇది eVTOL(ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే హెలికాప్టర్ లాగా నిటారుగా పైకి లేస్తుంది, మళ్ళీ నిటారుగానే ల్యాండ్ అవుతుంది. దీనికి రన్ వేలు అవసరం లేదు. సుమారు 7.5 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన ఈ విమానం, భారత్‌లో తయారైన అత్యంత అధునాతన, అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ టాక్సీ డెమో విమానంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రౌండ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. అంటే విమానం ఇంజిన్ సామర్థ్యం ఎంత? అది ఎంత బరువును మోయగలదు? వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటుందా? లేదా? అనే కీలకమైన పరీక్షలు జరుగుతున్నాయి.
చాలా రోజులుగా మనం ఎయిర్ టాక్సీల గురించి పేపర్లలో చదవడం, వీడియోల్లో చూడటమే తప్ప నిజంగా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం. కానీ ఇప్పుడు సార్ల ఏవియేషన్ ఆ దశను దాటేసింది. కేవలం డిజైన్లు, ల్యాబ్ టెస్టులకే పరిమితం కాకుండా, అసలు సిసలు విమానాన్ని సిద్ధం చేసి మైదానంలోకి తెచ్చింది. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో రాబోయే పూర్తి స్థాయి ఎయిర్ టాక్సీలకు గట్టి పునాది పడుతోంది. కంపెనీ తన టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ఇప్పటికే సుమారు 13 మిలియన్ డాలర్ల భారీ నిధులను కూడా సమకూర్చుకుంది. ఈ పెట్టుబడితో రాబోయే రోజుల్లో ఆపరేషన్స్ మరింత వేగవంతం కానున్నాయి.
ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఉండే వాళ్లకు ఇది ఒక వరం లాంటిది. రోడ్డు మీద రెండు గంటలు పట్టే ప్రయాణం, ఈ ఎయిర్ టాక్సీ ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఎయిర్‌పోర్టులకు వెళ్లే ప్రయాణికులకు ఇది అత్యంత వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. భవిష్యత్తులో నిర్వహించబోయే 'భారత్ మోబిలిటీ' ప్రదర్శనలో ఈ ఎయిర్ టాక్సీకి సంబంధించిన పూర్తి స్థాయి నమూనాను ప్రదర్శించడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.
మొత్తానికి చూస్తే ఆకాశంలో ఎగిరే కార్లు ఇక సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. మన ఊరి రోడ్ల పైన ఉన్న ట్రాఫిక్‌ను దాటుకుంటూ గాల్లో విహరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సార్ల ఏవియేషన్ చేపట్టిన ఈ సాహసోపేతమైన అడుగు సక్సెస్ అయితే, భారతీయ ప్రయాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైనట్టే!

