EV Market: చిన్న ఈవీ కంపెనీల సంచలనం.. రికార్డులను బద్దలు కొడుతూ పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ
పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ

EV Market: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు సరికొత్త విప్లవం నడుస్తోంది. కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా, చిన్న అలాగే ప్రాంతీయ ఈవీ తయారీదారులు కూడా అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నాయి. మార్కెట్లో తిరుగులేని స్థానంలో ఉన్న అగ్రగామి బ్రాండ్లకు ఈ చిన్న కంపెనీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లోనే ఇవి సాధించిన అమ్మకాల రికార్డులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
తొమ్మిది నెలల్లోనే మునుపటి రికార్డుల బ్రేక్
దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంటోంది. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 14.4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎంబీలిటీ, రివర్ మొబిలిటీ, బీగాస్ ఆటో అలాగే సింపుల్ ఎనర్జీ వంటి చిన్న కంపెనీలు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే గత ఏడాది మొత్తం అమ్మకాల రికార్డులను అధిగమించాయి. వినియోగదారులకు తగిన మోడళ్లు అందుబాటులోకి రావడం, బ్యాటరీ ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
దూసుకుపోతున్న గ్రీవ్స్
అంపియర్ స్కూటర్లను తయారు చేసే గ్రీవ్స్ ఎంబీలిటీ కంపెనీ ఈ ఏడాది ఇప్పటికే 66,069 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇది 57,699 యూనిట్లుగా ఉండేది. సెప్టెంబర్ నెలలో ఈ కంపెనీ ఓలాను సైతం వెనక్కి నెట్టి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు యామహా మద్దతు ఉన్న రివర్ మొబిలిటీ సంస్థ కూడా తన అమ్మకాలను రెట్టింపు చేసుకుని 35,250 యూనిట్లను విక్రయించింది. ముంబైకి చెందిన బీగాస్ ఆటో 32,101 యూనిట్లు విక్రయించగా, బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కూడా సుమారు 11 వేల యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది.
అమ్మకాలు పెరగడానికి గల కారణాలు
సాంకేతికత అభివృద్ధి చెందడం, ప్రభుత్వాల నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఈ చిన్న కంపెనీలకు ఊతం లభిస్తోంది. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తి పెరగడంతో విడిభాగాల ధరల భారం తగ్గింది. దీనివల్ల సామాన్యులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న కంపెనీలు పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తూ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని, డీలర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి.
అగ్రగామి కంపెనీల ఆధిపత్యం
చిన్న కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, మార్కెట్లో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ అలాగే ఓలా ఎలక్ట్రిక్ వంటి ఐదు పెద్ద కంపెనీల హవా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సుమారు 83 శాతం వాటా ఈ అగ్రగామి కంపెనీల చేతిలోనే ఉంది. అయినప్పటికీ చిన్న కంపెనీలు చూపుతున్న దూకుడు భవిష్యత్తులో మార్కెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది.

