మైలేజ్ కింగ్ ఎవరు? ఈ రెండిట్లో ఏ బైక్ బెస్ట్?

Splendor Plus vs Shine 100 DX : భారత మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కమ్యూటర్ సెగ్మెంట్‎లో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకోవడానికి హోండా షైన్ 100 డీఎక్స్ బైక్‌ను విడుదల చేసింది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు హీరో స్ప్లెండర్ ప్లస్ అగ్రస్థానంలో ఉంది. ఈ కొత్త పోటీదారు రాకతో, ఈ రెండు మోడల్స్‌లో ఏ బైక్ ఎక్కువ వాల్యూ ఫర్ మనీ అందిస్తుందో తెలుసుకుందాం.

డిజైన్, లుక్

హీరో స్ప్లెండర్ ప్లస్ తన పాత, స్లిమ్ బాడీ లుక్‌ను కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు కొత్త పెయింట్, డిజైన్ అప్‌గ్రేడ్‌లతో మెరుగ్గా కనిపిస్తోంది. ఇందులో 3D లోగో, స్ప్లెండర్+ బ్యాడ్జ్ ఉంటాయి. ఇది స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, బ్లాక్ రెడ్ పర్పుల్ వంటి ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. దీనికి భిన్నంగా హోండా షైన్ 100 డీఎక్స్ కొంచెం మందపాటి ఫ్యూయెల్ ట్యాం, ప్లాస్టిక్ బాడీలో క్రోమ్ హెడ్‌ల్యాంప్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. సింగిల్-పీస్ సీటు ట్యాంక్‌తో చక్కగా కలిసిపోవడం వల్ల బైక్‌కు మంచి లుక్ వచ్చింది.

ఫీచర్స్, సాంకేతిక అంశాలు

హీరో స్ప్లెండర్ ప్లస్ సాధారణంగా అనలాగ్ మీటర్‌తో వస్తుంది. అయితే పూర్తి డిజిటల్ ఫీచర్లు కావాలనుకునే కస్టమర్‌ల కోసం హీరో.. స్ప్లెండర్ ప్లస్ XTEC వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, SMS అలర్ట్‌లు, మైలేజ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. షైన్ 100 డీఎక్స్ బైక్‌లో సాధారణ ఫీచర్లు ఉన్నప్పటికీ, హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC వేరియంట్ ఫీచర్ల పరంగా ఒక అడుగు ముందుందని చెప్పవచ్చు.

హార్డ్‌వేర్, ఇంజిన్ పవర్

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, రెండు బైక్‌లలోనూ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ఐదు దశల్లో అడ్జస్ట్ చేయగలిగే ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. రెండు బైక్‌లలో ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నా, షైన్ 100 డీఎక్స్ లో 17-అంగుళాల చక్రాలు, స్ప్లెండర్ ప్లస్ లో 18-అంగుళాల చక్రాలు ఉన్నాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ లో 97.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 హెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ 100 డీఎక్స్ లో 98.98 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7.38 హెచ్‌పీ పవర్, 8.04 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ విషయంలో స్ప్లెండర్ ప్లస్ కొద్దిగా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, షైన్ 100 డీఎక్స్ నాలుగు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

ధరల తేడా

ప్రస్తుత మార్కెట్ ధరలను పరిశీలిస్తే, ధర విషయంలోనే వ్యత్యాసం కనిపిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రారంభ ధర రూ.83,251 (ఎక్స్-షోరూమ్) కాగా హోండా షైన్ 100 డీఎక్స్ ప్రారంభ ధర రూ.74,959 (ఎక్స్-షోరూమ్).

హోండా షైన్ 100 డీఎక్స్, స్ప్లెండర్ ప్లస్ కంటే దాదాపు రూ.8,292 తక్కువ ధరలో లభిస్తోంది. మీరు తక్కువ ధరలో మంచి క్వాలిటీ గల బేసిక్ కమ్యూటర్ బైక్‌ను కోరుకుంటే షైన్ 100 డీఎక్స్ మంచి ఎంపిక. అదే సమయంలో కొంచెం ఎక్కువ ధర వెచ్చించి, డిజిటల్ ఫీచర్లు, టెక్నాలజీ, కొద్దిగా ఎక్కువ పవర్ కావాలనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ బెస్ట్.

PolitEnt Media

PolitEnt Media

Next Story