Budget Cars : మైలేజ్, సేఫ్టీలో అదుర్స్... ఈ మూడు సెడాన్‌ల ముందు మిగతా కార్లు డమాల్!
ఈ మూడు సెడాన్‌ల ముందు మిగతా కార్లు డమాల్!

Budget Cars : ఈ మధ్య కాలంలో అందరూ ఎస్‌యూవీ కార్ల వెంట పడుతున్నారు కానీ, సెడాన్ కార్ల ఇచ్చే ఆ కంఫర్ట్, రాయల్ లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొడవాటి బాడీ, మంచి లెగ్ స్పేస్, లోపల కూర్చుంటే వచ్చే ఆ విలాసవంతమైన అనుభవం సెడాన్ సొంతం. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికి సెడాన్ కార్లే మొదటి ఛాయిస్. మీరు కూడా ఒక మంచి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? మీ కోసమే మార్కెట్లో ఉన్న మూడు చౌకైన మరియు బెస్ట్ సెడాన్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మొదటగా చెప్పుకోవాల్సింది టాటా టిగోర్ గురించి. ఇది మన దేశంలోనే అత్యంత చౌకైన సెడాన్ కారుగా పేరు తెచ్చుకుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.49 లక్షల నుంచే మొదలవుతుంది. టాటా అనగానే మనకు గుర్తొచ్చేది సేఫ్టీ. ఈ కారు గ్లోబల్ NCAP రేటింగ్‌లో 4 స్టార్స్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇది పెట్రోల్, సిఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మీద లీటరుకు 19.2 కిమీ, అదే సిఎన్‌జీ మీద కిలోకు 26 కిమీ వరకు మైలేజీ ఇస్తుంది. తక్కువ ధరలో మంచి బలం, సేఫ్టీ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.
ఇక రెండోది సౌకర్యాలకు మారుపేరుగా నిలిచే హ్యుందాయ్ ఆరా. దీని ప్రారంభ ధర దాదాపు రూ.5.98 లక్షలుగా ఉంది. ఆరా కారు లోపల ఇంటీరియర్ చాలా రిచ్‌గా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తాయి. అంటే తక్కువ ధరలో కూడా భద్రతకు పీఠం వేశారన్నమాట. వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. పెట్రోల్‌పై 20.5 కిమీ, సిఎన్‌జీపై 25 కిమీ మైలేజీ ఇస్తూ.. సిటీలో తిరగడానికి ఇది చాలా స్మూత్ కారు అనిపించుకుంటుంది.
మూడవది, ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న మారుతీ సుజుకి డిజైర్. ఇటీవలే కొత్త మోడల్ లాంచ్ అవ్వడంతో దీని క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. దీని ధర రూ.6.26 లక్షల నుండి మొదలవుతుంది. విశేషమేమిటంటే, మొదటిసారిగా మారుతీ సెడాన్ కారు గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా లాంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మైలేజీ విషయానికి వస్తే దీనికి తిరుగులేదు. పెట్రోల్‌పై 25.71 కిమీ, సిఎన్‌జీపై ఏకంగా 33.73 కిమీ మైలేజీ ఇస్తూ సామాన్యుల పాలిట మైలేజ్ మెషీన్ గా నిలుస్తోంది.
చివరగా, మీకు ఏ కారు సరిపోతుంది అనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. తక్కువ బడ్జెట్, గట్టి బాడీ కావాలంటే టిగోర్ వైపు చూడండి. ఎక్కువ ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్ కావాలంటే ఆరా బెస్ట్ ఆప్షన్. తిరుగులేని మైలేజీ, లేటెస్ట్ ఫీచర్లు, టాప్ సేఫ్టీ రేటింగ్ కావాలంటే కొత్త మారుతీ డిజైర్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఏది బెస్ట్ అనిపిస్తే అది ఇంటికి తెచ్చేసుకోండి!

