జాబితాలో నెంబర్ 1 ఏంటంటే?

Car Sales : భారతీయ కార్ల మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీ సెగ్మెంట్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే ప్రతి కస్టమర్‌కు హ్యాచ్‌బ్యాక్ కొనాలా లేక ఎస్‌యూవీ కొనాలా అనే ప్రశ్న వస్తున్నా, ప్రతి నెల అమ్మకాల నివేదికలు మాత్రం కొనుగోలుదారులు ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 2025 అమ్మకాల నివేదిక దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఆ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 25 కార్లలో ఏకంగా 16 స్థానాలను ఎస్‌యూవీలే దక్కించుకున్నాయి.

ఈ లెక్క చూస్తే మార్కెట్‌లో ఎస్‌యూవీల ప్రజాదరణ ఎంత పెరిగిందో అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా టాప్ 25లో కేవలం 1 సెడాన్, 3 ఎంపీవీలు , 4 హ్యాచ్‌బ్యాక్‌లు, 1 వ్యాన్ మాత్రమే చోటు దక్కించుకోగా మిగిలిన స్థానాలన్నీ ఎస్‌యూవీలకే దక్కాయి. ఈ నెలలో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అంటే కాంపాక్ట్ ఎస్‌యూవీలే వినియోగదారుల ఫస్ట్ ఆప్షన్ అయ్యాయని నిరూపితం అయింది.

టాప్ 10 లో ఎస్‌యూవీల ఆధిపత్యం

అక్టోబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో కూడా ఎస్‌యూవీలదే స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. టాటా నెక్సాన్ 22,083 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి డిజైర్ రెండో స్థానంతో సెడాన్ విభాగంలో తన ఉనికిని చాటుకుంది. మారుతి ఎర్టిగా ఎంపీవీ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా , మహీంద్రా స్కార్పియో, మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ వంటి ఎస్‌యూవీలు టాప్ 10 లో బలమైన స్థానాలను దక్కించుకున్నాయి. మారుతి వ్యాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు కూడా టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. ర్యాంక్ 11 నుంచి 20 వరకు ఉన్న జాబితాలో కూడా ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగింది. మహీంద్రా బొలెరో, మారుతి విక్టోరియస్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజా, మహీంద్రా థార్, హ్యుందాయ్ వెన్యూ వంటి ఎస్‌యూవీలు తమ పటిష్టమైన పర్ఫార్మెన్స్, ఫీచర్ల కారణంగా అధిక సంఖ్యలో అమ్ముడయ్యాయి.

టాప్ 20 తర్వాత కూడా ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌ల కలయిక కనిపించింది. మారుతి గ్రాండ్ విటారా, మహీంద్రా XUV700 వంటి ఎస్‌యూవీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. టాటా టియాగో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు మొదటి ఎంపికగా కొనసాగింది. కియా కారెన్స్ ఎంపీవీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచింది. కియా సెల్టోస్ కూడా ఎస్‌యూవీ మార్కెట్‌లో తన పట్టును నిలబెట్టుకుంది. మొత్తంగా అక్టోబర్ 2025 నాటి అమ్మకాల గణాంకాలు భారతీయ కొనుగోలుదారులు ఎస్‌యూవీల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత బలోపేతం అవుతుందని స్పష్టంగా చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story