2026లో మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త కింగ్‌లు ఇవే

Upcoming Mid-Size SUVs : భారతదేశంలో కార్ల మార్కెట్ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు చిన్న కార్లకు పెట్టింది పేరైన మన దేశంలో, ఇప్పుడు అందరి చూపు పెద్ద కార్ల వైపు, ముఖ్యంగా ఎస్‌యూవీల వైపు మళ్లింది. రోడ్ల మీద రాజసం ఉట్టిపడేలా ఉండే మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే.. 2024లో 23.20 లక్షలుగా ఉన్న ఎస్‌యూవీల విక్రయాలు, 2025 నాటికి 25.03 లక్షలకు చేరుకున్నాయి. అంటే ఏడాదిలోనే దాదాపు 7.85 శాతం వృద్ధి నమోదైంది. ఈ ట్రెండ్‌ను గమనిస్తున్న కార్ల కంపెనీలు 2026లో సరికొత్త మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లు రాజ్యమేలుతున్నాయి. వీటికి పోటీగా రెనో, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, నిస్సాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ పోటీ వల్ల వినియోగదారులకు తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు కలిగిన కార్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా రెనాల్ట్ డస్టర్ మళ్లీ కొత్త అవతారంలో రాబోతుండటం ఎస్‌యూవీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చాలా కాలం విరామం తర్వాత రెనో కంపెనీ తన ఐకానిక్ మోడల్ డస్టర్ కొత్త జనరేషన్‌తో భారత్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. గత నెలలోనే ఈ కారును ప్రదర్శించిన కంపెనీ, అప్పుడే ప్రీ-బుకింగ్స్ కూడా మొదలుపెట్టింది. వచ్చే నెలలో దీని ధర వెల్లడించి, ఏప్రిల్ నుంచి కస్టమర్లకు డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తోంది. 2012లో భారత్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విప్లవానికి నాంది పలికిన డస్టర్, ఇప్పుడు మరింత ఆధునిక హంగులతో మార్కెట్ లీడర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మరోవైపు స్కోడా కూడా తన పాపులర్ మోడల్ కుషాక్‎కు కొత్త హంగులు అద్ది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరిలో పరిచయం చేసింది. దీనికి కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మార్చి చివరి నాటికి రోడ్ల మీద కొత్త కుషాక్ సందడి చేయనుంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా రూ.9 వేల కోట్ల (1 బిలియన్ యూరోలు) పెట్టుబడితో తయారైన ఈ కార్లు, భారతీయ రోడ్లకు తగ్గట్టుగా ప్రత్యేకమైన MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ మీద రూపొందాయి. ఇదే బాటలో ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ టైగూన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను 2026 రెండో త్రైమాసికంలో లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

నిస్సాన్ కంపెనీ సైతం ఈ పోటీలో వెనుకబడకూడదని భావిస్తోంది. తన కొత్త వ్యూహంలో భాగంగా మూడు విభిన్న మోడళ్లను భారత్‌లో విడుదల చేయనుంది. అందులో అత్యంత కీలకమైనది నిస్సాన్ టెక్టాన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. దీన్ని 2026 మధ్య నాటికి మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. టెక్టాన్‌తో పాటు గ్రావిట్ ఎంపీవీ, ఒక 7-సీటర్ ఎస్‌యూవీ కూడా నిస్సాన్ లైనప్‌లో ఉన్నాయి. మొత్తానికి 2026 సంవత్సరం కార్ల ప్రియులకు పండగ తీసుకురాబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story