సుజుకి యాక్సెస్ ఏబీఎస్ వచ్చేసింది

Suzuki Access 125 : టూవీలర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజుకి యాక్సెస్ ఇప్పుడు మరింత సురక్షితంగా మారింది. తన కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తాజాగా యాక్సెస్ స్కూటర్‌ను సింగిల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. భారతీయ రోడ్లపై అత్యధికంగా అమ్ముడవుతున్న 125సీసీ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఒకటి. ఇప్పుడు దీనికి సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తోడవడంతో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత సేఫ్‌గా మారింది. అత్యవసర సమయంలో సడన్ బ్రేక్ వేసినప్పుడు చక్రం లాక్ అవ్వకుండా, స్కూటర్ స్కిడ్ కాకుండా ఈ ఏబీఎస్ కాపాడుతుంది. దీని ప్రారంభ ధర రూ.92,328 (ఎక్స్-షోరూమ్) కాగా, టీఎఫ్‌టీ స్క్రీన్, ఏబీఎస్ కలిగిన టాప్ మోడల్ ధర రూ.98,378 వరకు ఉంటుంది.

ఈ కొత్త స్కూటర్‌లో సుజుకి తన నమ్మకమైన 124cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించింది. ఇది 6,500 rpm వద్ద 8.43 bhp పవర్, 5,000 rpm వద్ద 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సివిటి గేర్‌బాక్స్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపిటర్ 125, హీరో డెస్టినీ, యమహా ఫాసినో వంటి స్కూటర్లతో ఇది నేరుగా పోటీ పడబోతోంది.

సుజుకి యాక్సెస్ ఏబీఎస్ వేరియంట్లలో స్టైలిష్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. బేసిక్ మోడల్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పర్ల్ వైట్ వంటి రంగుల్లో లభిస్తుండగా.. ప్రీమియం టీఎఫ్‌టీ వెర్షన్ లో పర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ వంటి ప్రత్యేక రంగులు ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160mm, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు. బరువు కూడా కేవలం 105 నుంచి 106 కిలోల మధ్య ఉండటంతో అందరికీ నడపడానికి వీలుగా ఉంటుంది.

కొత్త స్కూటర్ కొనేవారికి సుజుకి అదిరిపోయే ఫైనాన్స్ ఆఫర్లను ప్రకటించింది. కేవలం 6.99 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది అదృష్టవంతులకు రూ.5,000 విలువైన గిఫ్ట్ వోచర్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో ఉత్పత్తులను తీసుకురావడమే తమ లక్ష్యమని సుజుకి ఎండీ కెనిచి ఉమేడా తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story