Suzuki Access 125: మీరు కొత్త 125cc స్కూటర్ కొనాలని చూస్తున్నారా? మంచి మైలేజీ, ఫీచర్లతో పాటు స్టైలిష్ లుక్ కూడా కావాలనుకుంటే సుజుకి యాక్సెస్ 125 మీకు బెస్ట్ ఆప్షన్ కాగలదు. ప్రముఖ టూ-వీలర్ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన పాపులర్ స్కూటర్ యాక్సెస్ 125ను తాజాగా రెండు సరికొత్త రంగుల్లో అప్‌డేట్ చేసింది. లుక్ పరంగా మార్పు కోరుకునే కస్టమర్ల కోసం ఈ కొత్త షేడ్స్ తీసుకొచ్చింది. అయితే స్కూటర్ ఇంజిన్ గానీ, ఫీచర్లలో గానీ ఎలాంటి మార్పులు చేయలేదు. నవంబర్ 23, సోమవారం నుంచే దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త కలర్ వేరియంట్ల అమ్మకాలు మొదలయ్యాయి.

ఏ వేరియంట్‌కు ఏ రంగు?

సుజుకి యాక్సెస్ 125లో కొత్తగా మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బోర్డాక్స్ రెడ్ అనే రెండు రంగులను జోడించారు. వీటిలో మెటాలిక్ రాయల్ బ్రాంజ్ రంగు రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ABS వేరియంట్లలో లభిస్తుంది. ఇక మెటాలిక్ మ్యాట్ బోర్డాక్స్ రెడ్ రంగు కేవలం టాప్ వేరియంట్ అయిన రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్‎లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ABS వేరియంట్లలో పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ రంగును కూడా చేర్చారు. స్టాండర్డ్ ఎడిషన్‌లో ఇప్పుడు సాలిడ్ ఐస్ గ్రీన్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. స్పెషల్ ఎడిషన్ రంగుల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

సుజుకి యాక్సెస్ 125 అన్ని వేరియంట్ల ధరల జాబితా ఇదే

భారత మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 మొత్తం 5 వేరియంట్లలో లభిస్తోంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:

* స్టాండర్డ్ ఎడిషన్: రూ.83,086 (మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2, స్టెల్లార్ బ్లూ, సాలిడ్ ఐస్ గ్రీన్)

* స్పెషల్ ఎడిషన్: రూ.89,428 (బ్లాక్, స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్)

* రైడ్ కనెక్ట్ ఎడిషన్: రూ.91,627 (పాత రంగులతో పాటు కొత్త మెటాలిక్ రాయల్ బ్రాంజ్)

* రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్: రూ.98,432 (మెటాలిక్ రాయల్ బ్రాంజ్, పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్)

* రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్: రూ.1,03,780 (కొత్త మెటాలిక్ మ్యాట్ బోర్డాక్స్ రెడ్)

ఇంజిన్ సామర్థ్యం, మైలేజీ ప్రత్యేకతలు

మెకానికల్‌గా సుజుకి యాక్సెస్ 125 తన నమ్మకమైన ఇంజిన్‌నే కొనసాగిస్తోంది. ఇందులో 125cc సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది SOHC, టూ-వాల్వ్ సెటప్‌తో వస్తుంది. ఇంజిన్‌లో OBD-2B ప్రమాణాలతో పాటు సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వల్ల స్కూటర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా అద్భుతమైన మైలేజీని కూడా ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

24.4 లీటర్ల స్టోరేజ్, టీఎఫ్‌టీ స్క్రీన్, ఏబీఎస్ సేఫ్టీ

ఫీచర్ల విషయానికి వస్తే, యాక్సెస్ 125లో 24.4 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్, బయటి నుంచే పెట్రోల్ కొట్టించుకునే ఫ్యూయల్ లిడ్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. రైడ్ కనెక్ట్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీని ద్వారా ఫోన్ కనెక్ట్ చేసి టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్-మెసేజ్ అలర్ట్‌లు పొందవచ్చు. టాప్ వేరియంట్ TFT ABS ఎడిషన్‌లో 4.2 అంగుళాల కలర్ TFT స్క్రీన్ ఇచ్చారు. అదనపు భద్రత కోసం ABS వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABS సపోర్ట్ ఉండటం వల్ల సడెన్ బ్రేకులు వేసినప్పుడు స్కూటర్ అదుపు తప్పకుండా ఉంటుంది.

Next Story