Suzuki Hayabusa : సూపర్ బైక్ అంటే ఇదే.. అబ్బబ్బా.. ఆ బ్లూ కలర్ చూస్తే మతి పోవాల్సిందే
అబ్బబ్బా.. ఆ బ్లూ కలర్ చూస్తే మతి పోవాల్సిందే

Suzuki Hayabusa : ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులను మెస్మరైజ్ చేసిన సుజుకి హయబుసా బైక్ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 2026 సుజుకి హయబుసా స్పెషల్ ఎడిషన్‌ను సుజుకి మోటార్‌సైకిల్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్‌ను ప్రత్యేకమైన బ్లూ-థీమ్ డిజైన్, స్పెషల్ బ్యాజింగ్, మరికొన్ని అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్‌తో పరిచయం చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ తో పాటు, స్టాండర్డ్ మోడల్‌లో కూడా కొన్ని చిన్న చిన్న అప్‌డేట్‌లు చేశామని కంపెనీ తెలిపింది. అయితే, మెకానికల్‌గా ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
2026 హయబుసా స్పెషల్ ఎడిషన్ అతిపెద్ద ఆకర్షణ దాని బ్లూ, వైట్ కలర్ థీమ్. ఈ థీమ్ సుజుకి రేసింగ్ బైక్‌ల నుంచి ప్రేరణ పొందింది. ఇది సూపర్ బైక్‌ల ప్రపంచంలో సుజుకికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేకంగా ఇవ్వబడిన స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్, బ్లాక్ 3డి సుజుకి లెటరింగ్‌తో వస్తుంది. అలాగే డ్యూయల్ షేడ్స్, షార్ప్ బాడీ లైన్స్, పెద్ద సైజు ఫ్రేమ్ దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇది సాధారణ బైక్ కాదని, సూపర్ స్పోర్ట్ బైక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ అని చూసిన వెంటనే అర్థమవుతుంది.
2026 సుజుకి హయబుసా స్పెషల్ ఎడిషన్‌ను టెక్నాలజీ పరంగా మరింత బలంగా తయారు చేశారు. రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే, పెర్ఫార్మెన్స్‌ను స్మూత్ చేసే అనేక అప్‌డేట్‌లను జోడించారు. బైక్‌లో ఎప్పటిలాగే ఐకానిక్ ట్విన్ స్టెయిన్‌లెస్-స్టీల్ సైలెన్సర్ ఇచ్చారు. అయితే ఈసారి ఇది బ్లాక్ ఎనోడైజ్డ్ ఎండ్ క్యాప్స్, బ్లాక్ హీట్ షీల్డ్స్‌తో వచ్చి, మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. సుజుకి ఆప్షనల్ గా Akrapovic స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్‌ను కూడా అమర్చుకునే వెసులుబాటును ఇచ్చింది.
కొత్త హయబుసాకు కొన్ని హై-టెక్ ఫీచర్స్ జోడించారు. గేర్ మార్చిన తర్వాత కూడా యాక్టివ్‌గా ఉండేలా క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను అప్‌డేట్ చేశారు. లో-ఎండ్ టార్క్‌ను మెరుగుపరచడానికి థ్రాటిల్ మ్యాప్‌ను రీట్యూన్ చేశారు. అప్‌డేట్ చేసిన లాంచ్ కంట్రోల్ సిస్టమ్ వేగవంతమైన స్టార్ట్‌కు సహాయపడుతుంది. బైక్ మొత్తం బరువును తగ్గించేందుకు, పాత బ్యాటరీకి బదులుగా తేలికైన లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు.
సుజుకి 2026 హయబుసా స్పెషల్ ఎడిషన్ అంతర్జాతీయ ధరను 18,999 యూరోలు (సుమారు రూ.22.15 లక్షలు)గా నిర్ణయించింది. స్టాండర్డ్ మోడల్ ధర 18,599 యూరోలు (సుమారు రూ.21.67 లక్షలు). భారతదేశంలో ప్రస్తుత హయబుసా ఎక్స్-షోరూమ్ ధర రూ.18.06 లక్షలు ఉంది. కొత్త అప్‌డేట్‌లతో 2026 స్టాండర్డ్ మోడల్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లోకి రావచ్చని, అప్పుడు ధరలో సుమారు రూ.30,000 వరకు పెరుగుదల కనిపించవచ్చని అంచనా.

