Suzuki Motorcycle : భారత టూవీలర్ మార్కెట్‌లో సుజుకి మోటార్‌సైకిల్ తన జోరును కొనసాగిస్తోంది. 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరాన్ని కంపెనీ ఘనంగా ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, సుజుకి బైక్‌లు మరియు స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభించిందని స్పష్టమవుతోంది. కేవలం దేశీయంగానే కాకుండా, విదేశాలకు ఎగుమతుల్లో కూడా సుజుకి సరికొత్త రికార్డులను సృష్టించింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఏప్రిల్ 2026 నెలలో మొత్తం 1,17,514 యూనిట్ల విక్రయాలను జరిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 4 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇందులో దేశీయ మార్కెట్‌లో 98,000 కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడవగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్‌లో సుజుకి విదేశాలకు 19,510 యూనిట్లను ఎగుమతి చేసింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరగడం విశేషం. దీనిని బట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సుజుకి బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోందని అర్థమవుతోంది.

కేవలం వాహనాల అమ్మకాల్లోనే కాదు, విడిభాగాల వ్యాపారంలో కూడా సుజుకి సత్తా చాటింది. ఏప్రిల్ నెలలో స్పేర్ పార్ట్స్ విక్రయాల ద్వారా కంపెనీకి రూ.915 మిలియన్లకు పైగా ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత్‌లో తయారీ కార్యకలాపాలు మొదలుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో.. కస్టమర్లకు మెరుగైన సర్వీస్ అందించడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం లభించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

సుజుకి తన ఫేమస్ స్కూటర్ సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ కోసం వన్ అండ్ ఓన్లీ ఎడిషన్‌ను లాంచ్ చేయగా, అవెనిస్ స్పెషల్ ఎడిషన్‌లో కొత్త కలర్ ఆప్షన్‌ను జోడించింది. అంతేకాకుండా, ముంబైలో నిర్వహించిన సుజుకి మత్సురి ఈవెంట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. బైక్ ప్రియుల కోసం కోల్‌కతాలో నిర్వహించిన వీ-స్ట్రోమ్ ఎక్స్‌పీరియన్స్ డే కూడా భారీ సక్సెస్ అయ్యింది.

సుజుకి ఇండియా సీనియర్ అధికారి దీపక్ ముత్రేజా మాట్లాడుతూ.. దేశీయ, ఎగుమతి విభాగాల్లో సాధించిన ఈ సమతుల్య వృద్ధి కస్టమర్లకు కంపెనీపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన టెక్నాలజీతో కూడిన వాహనాలను పరిచయం చేయడమే కాకుండా, కస్టమర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా మరింత బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా యాక్సెస్ 125, జిక్సర్ వంటి మోడళ్లకు యువతలో క్రేజ్ తగ్గకపోవడం కంపెనీకి కలిసి వచ్చే అంశం.

PolitEnt Media

PolitEnt Media

Next Story