Suzuki : రికార్డులను తిరగరాసిన యాక్సెస్, జిక్సర్..ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతున్న సుజుకీ
ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతున్న సుజుకీ

Suzuki : సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 2025 డిసెంబర్ మాసంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. గత ఏడాది (డిసెంబర్ 2024)లో సుమారు 97,000 యూనిట్లు విక్రయించిన కంపెనీ, ఈ ఏడాది ఏకంగా 1,22,366 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. అంటే కేవలం ఒక నెలలోనే దాదాపు 25 వేలకు పైగా అదనపు వాహనాలను విక్రయించి 26 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. పండుగ సీజన్ ముగిసినా కూడా సుజుకి స్కూటర్లు, బైకులకు డిమాండ్ తగ్గకపోవడం విశేషం.
భారత మార్కెట్లో సుజుకి సక్సెస్ వెనుక యాక్సెస్ 125 స్కూటర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. డిసెంబర్ నెలలో దేశీయ అమ్మకాలు 24 శాతం పెరిగి 97,823 యూనిట్లకు చేరుకున్నాయి. యాక్సెస్‌తో పాటు బర్గ్ మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి స్కూటర్లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం సిటీల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుజుకి కమ్యూటర్ బైకులకు మంచి ఆదరణ లభించింది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్ చేయడం కంపెనీకి కలిసి వచ్చింది.
కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా సుజుకి మేడ్ ఇన్ ఇండియా వాహనాలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఎగుమతుల విభాగంలో కంపెనీ ఏకంగా 37 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2024లో 17,970 యూనిట్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది డిసెంబర్ లో 24,543 యూనిట్లు విదేశీ మార్కెట్లకు పంపబడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో సుజుకి బ్రాండ్ వాల్యూ పెరుగుతోందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
బైకుల అమ్మకాలతో పాటు, స్పేర్ పార్ట్స్ విభాగంలో కూడా సుజుకి అరుదైన మైలురాయిని అందుకుంది. డిసెంబర్ 2025లో స్పేర్ పార్ట్స్ విక్రయాల ద్వారా రూ. 961 మిలియన్ల ఆదాయాన్ని గడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఆదాయం కావడం విశేషం. సర్వీస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, కస్టమర్లకు చేరువగా విడిభాగాలను అందుబాటులో ఉంచడం వల్ల ఈ విజయం సాధ్యమైందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
2025లో సాధించిన ఈ భారీ విజయంతో ఉత్సాహంగా ఉన్న సుజుకి, 2026లో మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టే యోచనలో ఉంది. కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుజుకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

