Suzuki : సుజుకి సంచలన నిర్ణయం.. భారతదేశంలో వేల కోట్ల పెట్టుబడులు
భారతదేశంలో వేల కోట్ల పెట్టుబడులు

Suzuki : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. సుజుకి ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి ఒక ప్రకటనలో రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70,000 కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపారు. గుజరాత్‌లోని హన్స్‌లపూర్ ప్లాంట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు 'e-Vitara SUV'కి పచ్చజెండా ఊపిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. ఈ రూ. 70,000 కోట్ల పెట్టుబడిని మూడు ప్రధాన రంగాలలో ఖర్చు చేస్తామన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, కొత్త మోడళ్లను, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడం, భారత మార్కెట్లో తమ వాటాను మరింత బలోపేతం చేసుకోవడం వంటి వాటి కోసం ఈ పెట్టుబడిని ఉపయోగిస్తామని చెప్పారు. ఈ భారీ పెట్టుబడి వల్ల ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌లలో ఒకటిగా మారే దిశగా అడుగులు వేస్తుంది.
సుజుకి కంపెనీ ఇప్పటికే హైబ్రిడ్ కార్ల కోసం లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించిందని తోషిహిరో సుజుకి తెలిపారు. ఈ చర్య భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశం సుజుకి మోటార్ కార్పొరేషన్కు అతిపెద్ద మార్కెట్. అమ్మకాలు, ఆదాయం రెండింటిలోనూ భారతదేశం జపాన్‌ను అధిగమించింది. ఈ కారణంగానే కంపెనీ ఇక్కడ తమ పెట్టుబడులు, ఉత్పత్తిపై నిరంతరం దృష్టి సారిస్తోంది.
సుజుకి భారీ పెట్టుబడి ప్రకటన, మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా లాంచ్ ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల సమయానికి మారుతి షేర్ల ధర రూ. 149.95 పెరిగి రూ. 14,608.10కి చేరుకుంది. సుజుకి కంపెనీ తమ గుజరాత్ ప్లాంట్లో తయారయ్యే ఇ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 100 దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. దీనివల్ల భారతదేశం దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈవీ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది.
