Tata Aeris: మారుతి డిజైర్కే చెక్ పెట్టేలా టాటా ఏరిస్.. ఈ 5 అద్భుతమైన ఫీచర్లు వేరే లెవల్ అంతే
ఫీచర్లు వేరే లెవల్ అంతే

Tata Aeris: టాటా మోటార్స్ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టాటా ఏరిస్‌ను రూ.5.29 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఫస్ట్ చూస్తే ఇది పాత టిగోర్ మోడల్ లాగా అనిపించినప్పటికీ కంపెనీ దీన్ని పూర్తిగా మార్చి ఆధునిక హంగులతో తీర్చిదిద్దింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే ఈ కారు, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి డిజైర్ కారుకు గట్టి పోటీ ఇస్తోంది. కేవలం ధరలోనే కాకుండా ఫీచర్ల పరంగా డిజైర్ కారులో కూడా లేని కొన్ని అద్భుతమైన ప్రత్యేకతలను ఏరిస్ కలిగి ఉంది.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
సాధారణంగా కూలింగ్ లేదా వెంట్ిలేటెడ్ సీట్ల ఫీచర్ కేవలం రూ.10 లక్షలకు పైబడిన ప్రీమియం కార్లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ టాటా ఏరిస్ ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫ్రంట్ సీట్లకు వెంటిలేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. టాప్-ఎండ్ అకంప్లిష్డ్ వేరియంట్‌లో ఈ ఫీచర్ లభిస్తుంది. దీనితో పాటు ఇచ్చిన లెడ్రెట్ సీట్లు కారు లోపలి భాగానికి మరింత రిచ్ లుక్‌ను తెచ్చిపెడతాయి. వేసవి కాలంలో ఈ ఫీచర్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
డ్రైవింగ్ ఈజీ చేసే 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్
రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతున్న తరుణంలో పార్కింగ్ చేయడం పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ సమస్యను దూరం చేయడానికి టాటా ఏరిస్ కారులో 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా రెండు వైపులా ఉన్న ORVM ల కోసం బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఇచ్చారు. క్రియేటివ్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ వల్ల డ్రైవర్ కారు చుట్టూ ఉన్న పరిసరాలను చాలా స్పష్టంగా చూడవచ్చు. హోండా అమేజ్ కారులో సింగిల్-సైడ్ కెమెరా మాత్రమే ఉండగా, మారుతి డిజైర్ లో ఈ టెక్నాలజీ అసలు లభించదు.
ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్
ప్రస్తుత కాలంలో రోడ్డు భద్రత కోసం డాష్‌క్యామ్ వాడకం చాలా తప్పనిసరి అయింది. మార్కెట్లో విడిగా కొని ఫిట్ చేయించుకోవాలంటే అదనపు ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ టాటా కంపెనీ ఏరిస్ కారులో కంపెనీ ఫిట్టెడ్ ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్‌ను అందించింది. కారు చుట్టూ ఉన్న కెమెరా సిస్టమ్‌ను ఉపయోగించుకుని ముందు, వెనుక, పక్క భాగాల రికార్డింగ్ సులభంగా చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ టాటా ఏరిస్ టాప్ వేరియంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
వైర్‌లెస్ ఛార్జింగ్, భారీ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్
ప్రయాణంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండటానికి సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ డెక్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. దీనివల్ల ఎలాంటి కేబుల్స్ గోల లేకుండా ఫోన్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పెద్దదైన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో చేర్చారు. హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా కార్లలో కేవలం 8 అంగుళాల స్క్రీన్ మాత్రమే రాగా, మారుతి డిజైర్ 9 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. కానీ టాటా ఏరిస్ పెద్ద స్క్రీన్‌తో కేబిన్‌ను సరికొత్త డిజిటల్ లుక్‌లోకి మార్చేసింది.

