Tata Altroz iCNG AMT : టాటా ఆల్ట్రోజ్ సంచలనం.. సీఎన్జీలో ఆటోమేటిక్ గేర్.. దేశంలోనే మొదటి కారు
సీఎన్జీలో ఆటోమేటిక్ గేర్.. దేశంలోనే మొదటి కారు

Tata Altroz iCNG AMT : భారతీయ రోడ్లపై సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన టాటా మోటార్స్, తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. సీఎన్‌జీ కారు కొనాలనుకునే వారు ఇప్పటివరకు కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆల్ట్రోజ్ iCNG AMT(ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) మోడల్‌ను లాంచ్ చేసింది. ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్‌జీ కిట్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉన్న తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే కావడం విశేషం.
ధర మరియు వేరియంట్లు
కొత్త ఆల్ట్రోజ్ iCNG AMT ప్రారంభ ధరను రూ.8.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది:
* Pure: రూ. 8.69 లక్షలు
* Pure S: రూ. 8.99 లక్షలు
* Creative: రూ. 9.56 లక్షలు
* Creative S: రూ. 9.81 లక్షలు
* Accomplished S: రూ. 10.76 లక్షలు
సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చే ఇబ్బంది లేకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ కారు ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు.
ట్విన్ సిలిండర్ టెక్నాలజీ
సాధారణంగా సీఎన్‌జీ కార్లలో పెద్ద సిలిండర్ ఉండటం వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి అస్సలు చోటు ఉండదు. కానీ టాటా తన వినూత్న ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో ఈ సమస్యను పరిష్కరించింది. ఒక పెద్ద సిలిండర్‌కు బదులుగా రెండు చిన్న సిలిండర్లను డిక్కీ ఫ్లోర్ కింద అమర్చింది. దీనివల్ల కారులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. పెట్రోల్ కార్ల మాదిరిగానే ఇందులో కూడా బ్యాగులు సర్దుకోవచ్చు.
పవర్‌ఫుల్ ఇంజిన్.. డైరెక్ట్ సీఎన్‌జీ స్టార్ట్
ఈ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ iCNG ఇంజిన్ ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73.5 bhp శక్తిని, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని అడ్వాన్స్‌డ్ ECU టెక్నాలజీ వల్ల పెట్రోల్ నుంచి సీఎన్‌జీకి మారేటప్పుడు ఎలాంటి కుదుపులు ఉండవు. మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఈ కారును నేరుగా సీఎన్‌జీ మోడ్‌లోనే స్టార్ట్ చేయవచ్చు. దీనివల్ల పెట్రోల్ ఏమాత్రం లేకపోయినా కారును సులభంగా నడపవచ్చు.
హై-టెక్ ఫీచర్లు.. లగ్జరీ ఇంటీరియర్
ఆల్ట్రోజ్ లోపల, బయట డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ డిస్ప్లేలు (26.03 సెం.మీ), యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్ కారుకు విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది. 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ (S వేరియంట్లలో) వంటి మోడ్రన్ ఫీచర్లు కారు విలువను మరింత పెంచాయి.
5-స్టార్ సేఫ్టీ.. భారత్ NCAP రేటింగ్
టాటా కార్లంటేనే భద్రత. ఆల్ట్రోజ్ కారును ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. దీనికి భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్ లేదా టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

