Tata Avinya EV : రోడ్లపై మెరిసిన టాటా అవిన్యా ఈవీ.. 2027 నాటికి భారత మార్కెట్లోకి ఎంట్రీ
భారత మార్కెట్లోకి ఎంట్రీ

Tata Avinya EV : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ వాహన సామ్రాజ్యంలో మరో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా అవిన్యా భారత రోడ్లపై తొలిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. 2022లో మొదటిసారిగా కాన్సెప్ట్ రూపంలో ప్రపంచానికి పరిచయమైన ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ మోడల్‌గా మార్కెట్లోకి రావడానికి వేగంగా సిద్ధమవుతోంది. 2027 ప్రారంభంలో అవిన్యా X పేరుతో ఈ విప్లవాత్మక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫ్యూచరిస్టిక్ డిజైన్.. లగ్జరీ లుక్స్
స్పై షాట్ల ఆధారంగా, భారంగా ముసుగు కప్పబడినప్పటికీ ఈ కార్ బాడీ షేప్ చాలా స్లీక్‌గా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తోంది. పొడవైన వీల్‌బేస్, తక్కువ ఎత్తులో ఉండే స్లోపింగ్ రూఫ్‌లైన్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ప్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పెద్ద సైజు ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. టాటా ప్రస్తుతం విక్రయిస్తున్న నెక్సాన్, పంచ్ లేదా హారియర్ ఈవీల కంటే ఇది మరింత లగ్జరీగా రూపుదిద్దుకోబోతోంది.
సరికొత్త ప్లాట్‌ఫామ్ పై నిర్మాణం
మొదట్లో అవిన్యాను జెఎల్ఆర్ (JLR)కి చెందిన ఈఎమ్‌ఏ ఆర్కిటెక్చర్‌పై తయారు చేయాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం చెరీ-జెఎల్ఆర్ కలయికలోని ఫ్రీలాండర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఇందులోని ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ వర్కింగ్‌లను టాటా ప్రత్యేకంగా రీ-డిజైన్ చేస్తోంది. తమిళనాడులోని పనపాక్కంలో నిర్మిస్తున్న టాటా కొత్త ప్లాంట్‌లో ఈ కార్ల స్థానిక తయారీ జరగనుంది.
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ ఎంతంటే?
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ మోడల్‌లో 75kWh నుంచి 95kWh వరకు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశముంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా. హయ్యర్ వేరియంట్లలో డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌తో దాదాపు 300-400 హార్స్ పవర్ రేంజ్ లభించవచ్చు.

