Tata Cars: రూ.10 లక్షల లోపే 360 డిగ్రీ కెమెరా.. మార్కెట్‌ను ఊపేస్తున్న టాటా మూడు క్రేజీ కార్లు
టాటా మూడు క్రేజీ కార్లు

Tata Cars: ఒకప్పుడు ఆడి, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లకే పరిమితమైన 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. టాటా మోటార్స్ రూ. 10 లక్షల బడ్జెట్ పరిధిలోనే మూడు ప్రముఖ మోడళ్లలో ఈ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. 2026 నాటికి భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్, మైక్రో ఎస్‌యూవీ విభాగాల్లో ఈ మోడళ్లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.
1. టాటా టియాగో
చిన్న కారులోనూ మోడ్రన్ టెక్నాలజీ కావాలనుకునే వారికి టాటా టియాగో ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. ఈ జాబితాలో అత్యంత సరసమైన ధరకే లభించే మోడల్ ఇది. ఇందులో లభించే క్రియేటివ్ వేరియంట్ నుంచి 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను అందిస్తున్నారు. ధరల విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ. 8.24 లక్షలు కాగా, ఆటోమేటిక్ వెర్షన్ రూ. 8.87 లక్షలకు లభిస్తోంది. ఇంధన పొదుపు కోరుకునే వారి కోసం సిఎన్‌జి మాన్యువల్ రూ. 9.14 లక్షలు, సిఎన్‌జి ఆటోమేటిక్ రూ. 9.79 లక్షల ఆన్-రోడ్ ధరకు లభిస్తున్నాయి. తక్కువ ధరలో సేఫ్టీ, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.
2. టాటా పంచ్
దేశవ్యాప్తంగా క్రేజీ సేల్స్ సాధిస్తున్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో కూడా ఈ 360 డిగ్రీ కెమెరా ఆప్షన్ లభిస్తోంది. అడ్వెంచర్ వేరియంట్ నుంచి ఈ సెటప్‌ను కంపెనీ తీర్చిదిద్దింది. పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ ఆన్ రోడ్ ధర రూ. 9.04 లక్షలు ఉండగా, ఆటోమేటిక్ వేరియంట్ రూ. 9.72 లక్షలుగా ఉంది. సీఎన్‌జీ మాన్యువల్ మోడల్ రూ. 9.97 లక్షలు, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ రూ. 9.88 లక్షల ధర వద్ద మీ సొంతం చేసుకోవచ్చు. కాకపోతే సీఎన్‌జీ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 10.59 లక్షలు దాటడంతో పది లక్షల పరిమితి దాటిపోతుంది.
3. టాటా ఆల్ట్రోజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారి కోసం టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరాను అమర్చారు. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ. 9.48 లక్షల ఆన్ రోడ్ ధరకు లభిస్తోంది. దీని ఆటోమేటిక్ వెర్షన్ రూ. 10.11 లక్షలు, డీజిల్ మాన్యువల్ రూ. 11.34 లక్షలు ఉండటం వల్ల ఇవి పది లక్షల పరిమితిని దాటుతున్నాయి. బడ్జెట్ పరిమితి రూ. 10 లక్షల లోపే ఉన్నవారు పెట్రోల్ మాన్యువల్ మోడల్‌ను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు.
త్వరలోనే రాబోతున్న టాటా సఫారీ ఈవీ
ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా సఫారీ ఈవీ దీపావళి నాటికి మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అధునాతన ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ ఈవీ కారులో ఏకంగా 540 డిగ్రీల కెమెరా సెటప్‌తో పాటు అడాస్ ఫీచర్లు, సుదూర ప్రయాణాలకు వీలుగా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను జోడించనున్నారు.
ఇరుకైన వీధుల్లో పార్కింగ్ చేయడానికి, ట్రాఫిక్‌లో సురక్షితంగా ప్రయాణించడానికి 360 డిగ్రీ కెమెరా ఎంతో ఉపయోగపడుతుంది. సరసమైన ధరలోనే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్న ఈ టాటా కార్లు భారతీయ వాహనదారులకు నిజంగా గోల్డెన్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

