Tata Motors : మార్కెట్‌పై టాటా ఏకఛత్రాధిపత్యం.. ఈవీ అమ్మకాల్లో రికార్డుల మోత
Tata Motors : అక్టోబర్ 2025 పండుగ సీజన్ నెలలో భారతీయ కార్ల మార్కెట్ రికార్డు స్థాయిలో 5 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

Tata Motors : అక్టోబర్ 2025 పండుగ సీజన్ నెలలో భారతీయ కార్ల మార్కెట్ రికార్డు స్థాయిలో 5 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో కూడా వృద్ధి వేగం పుంజుకుంది. సెప్టెంబర్ 2025లో 16,354 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవగా, అక్టోబర్‌లో ఈ సంఖ్య 17,783 యూనిట్లకు పెరిగింది. ఇది గతేడాది అక్టోబర్ 2024తో పోలిస్తే 56% ఎక్కువ. అయితే ఈ పెరుగుదలలో టాటా మోటార్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అక్టోబర్‌లో 7,118 ఈవీలను విక్రయించడం ద్వారా, మార్కెట్‌లో 40% వాటాను తన ఖాతాలో వేసుకుంది. అయినప్పటికీ మహీంద్రా వంటి కంపెనీల నుంచి టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.
అక్టోబర్ 2025 నెల భారతీయ ఆటోమొబైల్ రంగానికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగ సీజన్ డిమాండ్ కారణంగా మొత్తం కార్ల అమ్మకాలు 5 లక్షల మార్కును దాటాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 16,354 యూనిట్ల నుండి అక్టోబర్‌లో 17,783 యూనిట్లకు పెరిగాయి. ఇది గతేడాది అక్టోబర్ 2024 (11,444 యూనిట్లు)తో పోలిస్తే 56% అధికం. అలాగే, సెప్టెంబర్‌తో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 విధానం అక్టోబర్‌లో అమ్మకాలపై ప్రభావం చూపింది.
కొత్త పన్ను విధానంలో పెట్రోల్/డీజిల్ కార్లపై జీఎస్టీ 28% నుండి 18% కి తగ్గింది. అంతేకాకుండా కాంపన్సేషన్ సెస్ తొలగించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై మాత్రం పాత 5% జీఎస్టీనే కొనసాగుతోంది. దీనివల్ల ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ కార్లలో పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మధ్య ధర వ్యత్యాసం గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే మారుతి సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా వంటి కంపెనీలు తమ అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేశాయి. అక్టోబర్ నెలకు టెస్లా, విన్‌ఫాస్ట్ ఇండియా వంటి కొత్త ఈవీ బ్రాండ్‌ల రాకతో భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మొత్తం కంపెనీల సంఖ్య 16కి చేరింది. టాటా మోటార్స్ తన స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియోతో మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ మొత్తం 7,118 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది (6,608 యూనిట్లు) కంటే 8%, సెప్టెంబర్ (6,634 యూనిట్లు) కంటే 7% ఎక్కువ. ఈ అమ్మకాలతో టాటా మోటార్స్ అక్టోబర్‌లో 40% మార్కెట్ వాటాను స్థిరంగా కొనసాగించింది. కొత్తగా విడుదలైన హారియర్ ఈవీ కంపెనీకి పెద్ద విజయాన్ని అందిస్తోంది. దీంతో పాటు పంచ్, నెక్సాన్, కర్వ్ ఈవీ మోడళ్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. టాటా పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే టియాగో, టిగోర్ ఈవీలు ఉన్నాయి. అయినప్పటికీ, కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేసిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీల నుంచి టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.

