Tata : టాటా మోటార్స్ ధమాకా.. మార్కెట్లోకి హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్.. బ్లాక్ లుక్‌తో అరాచకం
బ్లాక్ లుక్‌తో అరాచకం

Tata : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పండుగ సీజన్ కంటే ముందే వాహన ప్రియుల కోసం ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ మోడళ్లలో సరికొత్త స్టెల్త్ ఎడిషన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. కార్ల డిజైన్, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ను సరికొత్తగా ముస్తాబు చేస్తూ ఈ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు తిప్పుకోకుండా చేసేలా ఈ కార్లకు స్పోర్టీ ఆల్-బ్లాక్ లుక్‌ను టాటా మోటార్స్ జోడించింది.
టాటా సంస్థ ఈ సరికొత్త స్టెల్త్ ఎడిషన్‌ను కేవలం ఈ కార్ల టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరల విషయానికి వస్తే.. 2026 టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.23.43 లక్షల నుంచి ప్రారంభమై రూ.26.01 లక్షల వరకు ఉంది. అలాగే, టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.24.09 లక్షల నుంచి రూ.26.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో నిర్ణయించారు. గతంలో ఈ ఎడిషన్ పరిమిత సంఖ్యలోనే లభించగా, ఈసారి కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో లాంచ్ చేశారు. ఈ సరికొత్త లుక్, ఫీచర్లతో ఇది మార్కెట్లో ఉన్న మహీంద్రా XUV700 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ స్టెల్త్ ఎడిషన్‌లో కస్టమర్లను ఆకట్టుకునే ప్రధానమైన మార్పు దాని స్టెల్త్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ కలర్. ఈ కారుకు మరింత బోల్డ్ లుక్ ఇచ్చేందుకు రెండు ఎస్‌యూవీలలో సరికొత్తగా 19-ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్ అమర్చారు. కారు ముందు భాగంలో ఫెండర్ దగ్గర ప్రత్యేకంగా Stealth అనే క్రోమ్ బ్యాడ్జింగ్‌ను అందించారు. కారు పాత దబాంగ్, మస్క్యులర్ లుక్‌ను ఏమాత్రం దెబ్బతీయకుండా, కేవలం రంగు, వీల్స్ పరంగా ఈ కాస్మెటిక్ మార్పులు చేయడం వల్ల కారు మరింత క్లాసిక్‌గా కనిపిస్తోంది.
కేవలం బయట మాత్రమే కాదు, కారు ఇంటీరియర్ కూడా ప్రీమియం ఆల్-బ్లాక్ థీమ్‌ను లగ్జరీ కార్ల తరహాలో డిజైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన కార్బన్ నోయిర్ లెదరెట్ సీట్లు కేబిన్‌కు అత్యంత విలాసవంతమైన ఫీల్‌ను ఇస్తాయి. సెంటర్ కన్సోల్‌పై ఉన్న టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కోసం సరికొత్త డిజైన్ డైల్‌ను అందించారు. టెక్నాలజీ పరంగా.. 14.9 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 13-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, భద్రత కోసం లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS) వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ప్రత్యేక స్టెల్త్ ఎడిషన్ కార్లలో ఇంజిన్ మెకానిజం పరంగా టాటా ఎలాంటి మార్పులు చేయలేదు. రెగ్యులర్ మోడళ్లలో వచ్చే పవర్‌ఫుల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగించారు. ఈ కార్లు 170 హార్స్‌పవర్ (hp), 280 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు.. 170 హార్స్‌పవర్, 350 ఎన్‌ఎమ్ టార్క్ ఇచ్చే పవర్‌ఫుల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఈ రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎస్‌యూవీలలో రెగ్యులర్ లుక్ కాకుండా ఒక ప్రత్యేకమైన, డార్క్, లగ్జరీ ప్రీమియం లుక్‌ను కోరుకునే కస్టమర్లకు ఈ స్టెల్త్ ఎడిషన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

