టాటా నుంచి 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు

Tata Motors : భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ముందుగా వినిపించే పేరు టాటా మోటర్స్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి టాటా భారీ ప్లాన్‌తో ముందుకొచ్చింది. మహీంద్రా, ఎంజీ వంటి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తూ.. వచ్చే 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశంలో 2.5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన ఏకైక కంపెనీగా టాటా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్ ఊపుతో ఏకంగా రూ.18,000 కోట్ల పెట్టుబడిని ఈవీ సెగ్మెంట్‌లో పెట్టేందుకు సిద్ధమైంది.

టాటా మోటార్స్ సక్సెస్‌లో నెక్సాన్ ఈవీ పాత్ర చాలా కీలకం. దేశంలో అమ్ముడైన మొత్తం 2.5 లక్షల టాటా ఈవీలలో కేవలం నెక్సాన్ మోడలే ఒక లక్షకు పైగా ఉండటం విశేషం. అంటే ఈవీ మార్కెట్లో మెజారిటీ జనం నేక్సాన్‌నే నమ్ముకున్నారు. ప్రస్తుతం టాటా వద్ద టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి 6 మోడళ్లు ఉన్నాయి. ఇప్పుడు దీనిని మరింత విస్తరిస్తూ, రాబోయే ఐదేళ్లలో ఐదు సరికొత్త ఈవీ నేమ్‌ప్లేట్‌లను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించుకుంది.

టాటా మోటార్స్ కొత్త ఈవీల జాతర సియెర్రాతో మొదలుకానుంది. ఐకానిక్ బ్రాండ్ అయిన సియెర్రాను ఎలక్ట్రిక్ అవతార్‌లో 2026 ప్రారంభంలో తీసుకురాబోతున్నారు. దీని తర్వాత అదే ఏడాది చివర్లో ప్రీమియం లగ్జరీ ఈవీ బ్రాండ్ అవిన్యా రాబోతోంది. ఇది జాగ్వార్ లాండ్ రోవర్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటుండటం విశేషం. ఆ తర్వాత 2027 నుంచి 2030 మధ్య మరో మూడు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయనున్నారు. ఇవన్నీ భారతీయ రోడ్లకు అనుగుణంగా, రేంజ్ విషయంలో రాజీ పడకుండా రానున్నాయి.

కార్లను లాంచ్ చేయడమే కాదు, వాటిని వాడుతున్న కస్టమర్లకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా చూడటంపై టాటా దృష్టి పెట్టింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలనేది టాటా లక్ష్యం. ఇందులో ఒక లక్ష పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉంటాయి. దీని కోసం టాటా గ్రూప్ లోని ఇతర కంపెనీలతో కలిసి భారీగా పనిచేస్తోంది. టౌన్ల నుంచి హైవేల దాకా ప్రతి చోటా ఛార్జింగ్ సౌకర్యం ఉంటే, జనం పెట్రోల్ కార్ల కంటే ఈవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టాటా గట్టిగా నమ్ముతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story