Tata Motors: కారు కొనేవారికి బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు
టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు

Tata Motors: సెప్టెంబర్ మాసంలో కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి వాహన దిగ్గజాలు టాటా మోటార్స్, హ్యుందాయ్ బిగ్ షాక్ ఇచ్చాయి. సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా కార్ల ధరలను పెంచుతున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. టాటా కార్లపై గరిష్టంగా రూ. 25,000 వరకు భారం పడగా, హ్యుందాయ్ వాహనాల ధరలు 1 శాతం వరకు పెరిగాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై ధరల పెంపును అమల్లోకి తెచ్చింది. మోడల్, వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.25,000 వరకు పెరిగినట్లు సంస్థ స్పష్టం చేసింది. సాధారణ పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా ఈ పెంపు పరిధిలోకి వస్తాయి. విడిభాగాల తయారీ వ్యయం పెరగడం, అంతర్జాతీయంగా లోహాల ధరల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉత్పత్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని, ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని కంపెనీ ప్రకటించింది.
హ్యుందాయ్ లవర్లకు సైతం తప్పని ధరల బాదుడు
మరొక ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తన ప్యాసింజర్ వాహనాల మోడళ్లపై ధరల పెంపును నిర్ణయించింది. హ్యుందాయ్ కార్ల ధరలు గరిష్టంగా 1 శాతం వరకు పెరిగాయి. ఈ పెంపు మోడల్, వేరియంట్ విధానాన్ని బట్టి మారుతుంది. నిర్వహణ ఖర్చులు పెరగడం, ముడిసరుకుల ధరల భారం నిరంతరం కొనసాగుతుండటంతో 2026 సంవత్సరంలో హ్యుందాయ్ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనించాల్సిన విషయం. జనవరిలో 0.6 శాతం, జూన్‌లో 1 శాతం వరకు పెంచిన సంస్థ, సెప్టెంబర్‌లో మళ్లీ సవరించింది.
ఎలక్ట్రిక్ వాహనదారులపై ప్రత్యేక ప్రభావం
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లు ఎంచుకునే కొనుగోలుదారులకు ఈ పెంపు గురపముష్టిలా మారింది. టాటా మోటార్స్ తమ పాపులర్ ఎలక్ట్రిక్ కార్ల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా ఈవీలను కొనుగోలు చేయాలనుకునే వారి బడ్జెట్ గణనీయంగా పెరగనుంది. అయితే ప్రతి టాటా కారు ధర రూ. 25,000 పెరగలేదని, ఇది కేవలం అత్యధిక పెంపు పరిమితి మాత్రమేనని యాజమాన్యం స్పష్టం చేసింది. బేస్ మోడళ్లు, కొన్ని నిర్దిష్ట వేరియంట్లపై ప్రభావం కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కార్ల కంపెనీలు సవరించిన ఈ కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి తక్షణమే అమలులోకి వచ్చాయి. దీంతో పండుగల సీజన్ నాటికి సరికొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులు తమ బడ్జెట్ అంచనాలను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి కారు లేదా మోడల్‌పై పెంపు భిన్నంగా ఉన్నందున, బుకింగ్ లేదా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే ముందు సమీపంలోని డీలర్‌షిప్‌లను సంప్రదించి అప్‌డేట్ చేసిన కొత్త ధరల వివరాలు తెలుసుకోవడం ఎంతో ఉత్తమం.

