Tata Motors: టాటా మోటార్స్ సంచలన నిర్ణయం.. కొత్త పేరుతో ప్యాసింజర్ కార్లు
కొత్త పేరుతో ప్యాసింజర్ కార్లు

Tata Motors: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల విభాగానికి సరికొత్త గ్లోబల్ బ్రాండ్ ముద్ర వేసింది. ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని ఏకీకృతం చేస్తూ 'TATA.CARS' అనే నూతన కస్టమర్-ఫేసింగ్ బ్రాండ్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతున్న వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా టాటా మోటార్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. TATA.CARS బ్రాండ్ కింద హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ప్రీమియం ఎస్‌యూవీలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలను ఒకే మాస్టర్ బ్రాండ్ పరిధిలోకి తెస్తున్నారు. నథింగ్స్ టూ ఫార్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ప్రయాణికుల ఆశయాలకు, గమ్యస్థానాలకు కొత్త ఊపిరి పోస్తుందని కంపెనీ నమ్ముతోంది.
ఈ రీబ్రాండింగ్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తరతరాలుగా భారతీయ ప్రజలు సాధారణ సంభాషణల్లో టాటా వాహనాలను టాటా కార్ అని పిలవడమే. దశాబ్దాలుగా ప్రజల నాలుకలపై నానిన ఈ పదాన్నే కంపెనీ ఇప్పుడు అధికారిక గ్లోబల్ బ్రాండ్‌గా మార్చింది. కస్టమర్ల అనుబంధాన్ని గౌరవిస్తూ 'TATA.CARS' అనే పేరుతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం విశేషం.
నూతన బ్రాండ్ ఇమేజ్ కోసం పారలల్ పాత్‌వేస్ అనే విజువల్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. రోడ్డుపై ఉండే సమాంతర రేఖలు, టాటా చిహ్నమైన 'T' లోగో స్ఫూర్తితో ఇది రూపుదిద్దుకుంది. బ్రాండ్ ప్రధాన రంగుగా అంబిషన్ బ్లూను ఎంచుకున్నారు. దీనికి తోడు నూతన ఫాంట్, ప్రత్యేకమైన సౌండ్ ఐడెంటిటీని తీర్చిదిద్ది, వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో సరికొత్త వాతావరణం కల్పించనున్నారు.
కార్ల పేర్లు మారతాయా?
ఈ మార్పును చూసి ప్రస్తుత టాటా కార్ల పేర్లు మారుతాయేమోనని కస్టమర్లు గందరగోళానికి గురవ్వాల్సిన పనిలేదు. నెక్సాన్, పంచ్, సఫారీ వంటి ప్రాచుర్యం పొందిన వాహనాల పేర్లు యథాతథంగా కొనసాగుతాయి. వాహనాలపై ఉండే ప్రామాణిక టాటా లోగో కూడా అలాగే ఉంటుంది. కంపెనీ చట్టపరమైన కార్యకలాపాలు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ పేరుతోనే నడుస్తాయి. కేవలం వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు మాత్రమే ఈ నూతన బ్రాండింగ్ దోహదపడుతుంది.

