Tata Motors : భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్ సుదీర్ఘ కాలం పాటు తన హవా కొనసాగించడానికి ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. కంపెనీ తన కార్ల వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించాలని నిర్ణయించుకుంది. ఆర్థిక సంవత్సరం 2031 నాటికి మార్కెట్లో తమ మోడళ్ల సంఖ్యను ప్రస్తుతమున్న 9 నుంచి 15కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో 20 కి పైగా సరికొత్త ప్రొడక్ట్ అప్‌డేట్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేట్లలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు, ఇంజన్ అప్‌గ్రేడ్‌లు, అధునాతన ఫీచర్లు, కొత్త వేరియంట్లు ఉండనున్నాయి. ఈ దశాబ్దం ముగిసే నాటికి భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 18-20 శాతం వాటాను సొంతం చేసుకోవాలని టాటా భావిస్తోంది.

6 సరికొత్త కార్ల రాక

ఈ సుదీర్ఘ వ్యూహంలో భాగంగా టాటా మోటార్స్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6 సరికొత్త సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాటా సియెర్రా ఈవీ మొదటి వరుసలో ఉంది, దీనిని జూన్ 30న అధికారికంగా ప్రదర్శించనున్నారు. దీని తర్వాత కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ టాటా సఫారీ ఈవీని ఈ ఏడాది పండగ సీజన్ (దసరా-దీపావళి) కానుకగా లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇవే కాకుండా వచ్చే ఏడాది, అంటే 2027 లో తమ నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ సిరీస్ టాటా అవిన్యాను కూడా మార్కెట్లోకి దించనుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ అంచనాలు

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని నమ్ముతున్న టాటా మోటార్స్, ఈవీ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2031 నాటికి కంపెనీ విక్రయించే మొత్తం కార్లలో ఈవీల వాటానే 30 శాతం వరకు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని కోసం ప్రస్తుతం ఉన్న 6 ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్యను భవిష్యత్తులో 10 కి పెంచాలని చూస్తోంది. వచ్చే 2030 సంవత్సరం నాటికి భారతదేశంలోని మొత్తం కార్ల మార్కెట్లో ఈవీల వాటా 15 నుంచి 20 శాతానికి చేరుకుంటుందని టాటా అంచనా వేస్తోంది.

సీఎన్‌జీ కార్ల విస్తరణ, ఉత్పత్తి పెంపు

ఎలక్ట్రిక్ కార్లతో పాటు పర్యావరణహిత సీఎన్‌జీ వాహనాలను కూడా టాటా మోటార్స్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా భావిస్తోంది. 2031 నాటికి ఇండియాలో అమ్ముడయ్యే మొత్తం టాటా ప్యాసింజర్ కార్లలో ఈవీ, సీఎన్‌జీ వాహనాల వాటానే కలిపి సుమారు 45 శాతం వరకు ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ భారీ డిమాండ్‌కు తగ్గట్టుగా కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టాటా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఏడాదికి 6.4 లక్షల కార్లను విక్రయిస్తున్న టాటా, 2031 నాటికి ఆ సంఖ్యను ఏటా 12 లక్షలకు పైగా పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం రాబోయే 2-3 ఏళ్లలోనే తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 లక్షల యూనిట్ల నుంచి 13 లక్షల యూనిట్లకు పెంచేలా ప్లాంట్లు అప్‌గ్రేడ్ చేయనున్నారు. టాటా వేస్తున్న ఈ అడుగులు మార్కెట్ లీడర్స్ అయిన మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలకు గట్టి సవాలు విసరనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story