Tata Motors : టాటా మోటార్స్ మెగా ప్లాన్.. త్వరలోనే మార్కెట్లోకి 5 సరికొత్త కార్లు లాంచ్!
5 సరికొత్త కార్లు లాంచ్!

Tata Motors : భారతీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా మోటార్స్ తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో పెట్రోల్, సీఎన్‌జీ, ఫ్లెక్స్ ఫ్యూయల్, పూర్తి ఎలక్ట్రిక్ విభాగాలలో ఏకంగా 5 సరికొత్త కార్లను మార్కెట్లో ఆవిష్కరించేందుకు లైన్ క్లియర్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ నూతన వేరియంట్ల నుంచి అత్యంత విలాసవంతమైన అవిన్యా ఎక్స్ ఈవీ వరకు ప్రతి విభాగంలోనూ కస్టమర్లను ఆకట్టుకునేలా హైటెక్ ఫీచర్లతో ఈ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
టాటా నెక్సాన్ నూతన వేరియంట్లు
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా తన పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్‌లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్ట్ ప్రారంభంలోనే ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరసమైన ధరలతో పాటు కస్టమర్లకు గరిష్ట వాల్యూ అందించేలా మరిన్ని ఆధునిక ఫీచర్లను ఇందులో చేర్చనున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ రెండింట్లోనూ ఇవి లభించే అవకాశం ఉండగా, సీఎన్‌జీ మోడల్‌లో బూట్ స్పేస్ సమస్యను అధిగమించేలా ప్రత్యేక మార్పులు చేయనున్నారు.
ఫస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సఫారీ ఈవీ
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు నేరుగా సవాల్ విసురుతూ టాటా తమ మొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సఫారీ ఈవీని తీసుకురాబోతోంది. హారియర్ ఈవీలో వాడిన అడ్వాన్స్‌డ్ Acti.EV+ ప్లాట్‌ఫారమ్‌పైనే ఇది కూడా నిర్మితమవుతోంది. ఇందులో 65 kWh, 75 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌లను అందించనున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. లెవెల్-2 ADAS, ఆటో పార్క్, 540-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
మరిన్ని ఫీచర్లతో టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్
టాటా తమ కాంపాక్ట్ సెడాన్ టిగోర్ లో కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలోనే తీసుకురానుంది. టియాగో తరహాలోనే సరికొత్త ఫ్రంట్ లుక్, రీడిజైన్ చేసిన క్యాబిన్‌తో ఇది రానుంది. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్ ఉండగా, ఈవీ వర్షన్‌లో 26 kWh బ్యాటరీ ప్యాక్‌ను కొనసాగించనున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇథనాల్‌తో నడిచే టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్
పర్యావరణహిత ఇంధనాలను ప్రోత్సహించే దిశగా టాటా తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ప్రవేశపెట్టబోతోంది. అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ ఎస్‌యూవీ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఇది రోడ్లపైకి రానుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది, ఇది E85 (85% ఇథనాల్, 15% పెట్రోల్) ఇంధనంతో సులభంగా నడుస్తుంది. దీనికి అనుగుణంగా ఇంజన్, ఫ్యూయల్ సరఫరా వ్యవస్థలో టాటా నిపుణులు ప్రత్యేక మార్పులు చేస్తున్నారు.
హైటెక్ ఫ్యూచరిస్టిక్ టాటా అవిన్యా ఎక్స్
ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో గ్లోబల్ బ్రాండ్లకు పోటీగా టాటా రూపొందిస్తున్న అత్యంత విలాసవంతమైన ఈవీ అవిన్యా ఎక్స్. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో రానున్న ఈ 5-సీటర్ ఈవీ ఎస్‌యూవీలో భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, నెక్స్ట్-జెన్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉండనున్నాయి. ఇందులో 65 నుంచి 80 kWh వరకు ఉండే పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో ఈ మోడల్‌లో 7-సీటర్ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో టాటా ఉంది.

