Tata Motors : టాటా మోటార్స్ ధమాకా..అమ్మకాల్లో హ్యుందాయ్‌కి చెక్ పెట్టి రెండో స్థానానికి చేరిన దేశీ దిగ్గజం
అమ్మకాల్లో హ్యుందాయ్‌కి చెక్ పెట్టి రెండో స్థానానికి చేరిన దేశీ దిగ్గజం

Tata Motors : 2026 సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగానికి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. జనవరి నెల కార్ల అమ్మకాల గణాంకాలు వెలువడగా, మార్కెట్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటిలాగే మారుతి సుజుకి తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, రెండో స్థానం కోసం జరిగిన పోరులో టాటా మోటార్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాటా మోటార్స్ రన్నరప్‌గా నిలవడం ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్ జనవరి 2026లో మునుపెన్నడూ లేని విధంగా 4,52,589 కార్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది దాదాపు 12.7 శాతం వృద్ధి. ఈ రేసులో మారుతి సుజుకి 1,74,529 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే మారుతి వృద్ధి కేవలం 0.5 శాతంగానే ఉండగా, టాటా మోటార్స్ మాత్రం ఏకంగా 46.1 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 70,222 కార్లను విక్రయించిన టాటా, తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.
ఈ గణాంకాలు భారతీయ కొనుగోలుదారుల అభిరుచి మారుతోందని స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడు జనం ఎక్కువగా ఎస్‌యూవీలు, సేఫ్టీకి ప్రాధాన్యతనిచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే నెక్సాన్, పంచ్, హారియర్ వంటి పటిష్టమైన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో ఉన్న టాటా మోటార్స్.. హ్యుందాయ్‌ని నాలుగో స్థానానికి నెట్టేసింది. మహీంద్రా కూడా తన స్కార్పియో, థార్, XUV700 వంటి మోడళ్లతో మంచి పోటీనిచ్చినప్పటికీ, టాటా సాధించిన భారీ వృద్ధి ముందు మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.
హ్యుందాయ్ విషయానికొస్తే క్రెటా, వెన్యూ వంటి మోడళ్లు ఉన్నప్పటికీ టాటా, మహీంద్రా వేగంతో పోలిస్తే హ్యుందాయ్ కొంత వెనుకబడి నాలుగో స్థానంలో నిలిచింది. టయోటా తన ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి నమ్మకమైన వాహనాల దయతో టాప్-10లో స్థిరంగా కొనసాగుతోంది. ఇక లగ్జరీ విభాగంలో వోల్వో వంటి బ్రాండ్లు కూడా మంచి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. టాటా సియెర్రా, మహీంద్రా BE 6 వంటి కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా మార్కెట్లోకి రావడంతో భవిష్యత్తులో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
మొత్తానికి జనవరి 2026 సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత కార్ల మార్కెట్ ఇప్పుడు ఎస్‌యూవీల సామ్రాజ్యంగా మారిపోయింది. కేవలం మైలేజీ మాత్రమే కాకుండా స్టైల్, సేఫ్టీ, టెక్నాలజీ ఉన్న కార్లకే జనం జై కొడుతున్నారు. మారుతి తన నెట్‌వర్క్ బలంపై ఆధారపడుతుంటే, టాటా తన సేఫ్టీ ఇమేజ్‌తో కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది. రాబోయే నెలల్లో టాటా తన రెండో స్థానాన్ని ఎంతవరకు కాపాడుకుంటుందో, హ్యుందాయ్ మళ్ళీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.

