Tata Motors Price Hike: టాటా కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కొత్త రేట్లు
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కొత్త రేట్లు

Tata Motors Price Hike: టాటా కార్ల ప్రేమికులకు చేదు వార్త. ప్రముఖ వాహన దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. మీరు టాటా పంచ్, నెక్సాన్ లేదా హారియర్ వంటి కార్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ నెలాఖరులోపు బుక్ చేసుకోవడం మంచిది. టాటా ప్యాసింజర్ వెహికల్స్ యూనిట్ (TMPV) తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి లోహాల ధరలతో పాటు ఇతర విడిభాగాల ఖర్చు కూడా అధికమైంది. ఈ అదనపు ఉత్పత్తి వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సగటున 0.5% వరకు ధరల పెంపు ఉండవచ్చని, ఇది మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
కమర్షియల్ వాహనాల పరిస్థితి ఏంటి?
కేవలం ప్యాసింజర్ కార్లు మాత్రమే కాదు, టాటా మోటార్స్ తమ కమర్షియల్ వాహనాల (ట్రక్కులు, బస్సులు) ధరలను కూడా ఏప్రిల్ 1 నుంచి పెంచుతోంది. నివేదికల ప్రకారం కమర్షియల్ వాహనాల ధరలు సుమారు 1.5% వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రవాణా రంగంపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. వాహన నాణ్యతలో రాజీ పడకుండా ఉండటానికే ఈ ధరల సవరణ తప్పనిసరి అని కంపెనీ సమర్థించుకుంటోంది.
మిగతా కంపెనీలదీ ఇదే దారి
ధరల పెంపు విషయంలో కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాదు, మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమ ఒత్తిడిలో ఉంది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా భారత్‌లో తమ కార్ల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ధరల సవరణపై తీవ్రంగా ఆలోచిస్తోంది. ముడి సరుకుల ధరల పెరుగుదల వల్ల లాభాల మార్జిన్ తగ్గిపోతోందని, అందుకే ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
కస్టమర్లకు సలహా.. ఇప్పుడే సరైన సమయం
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి కాబట్టి, మార్చి నెలాఖరు వరకు పాత ధరలకే కార్లు లభించే అవకాశం ఉంది. దీనికి తోడు కొన్ని డీలర్‌షిప్‌లు మార్చి ఎండింగ్ ఆఫర్లను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాబట్టి కారు కొనాలనే ఆలోచన ఉన్నవారు వచ్చే 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఏప్రిల్ నుంచి మోడల్‌ను బట్టి వేల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది.

