Tata Motors: వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కంపెనీ నికర లాభం ఏకంగా 83 శాతం పెరిగి రూ.2,560 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,397 కోట్ల లాభంతో పోలిస్తే ఇది భారీ జంప్. ఈ వ్యవధిలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి 19 శాతం పెరిగి రూ.20,667 కోట్లకు చేరుకోవడం విశేషం. ట్రక్కులు, బస్సుల విక్రయాలు పుంజుకోవడమే ఈ అనూహ్య లాభాలకు ప్రధాన కారణమని స్టాక్ మార్కెట్ వర్గాలకు సమర్పించిన నివేదికలో కంపెనీ తెలిపింది.

లక్షకు పైగా వాహనాల విక్రయం

సేల్స్ రంగాన్ని పరిశీలిస్తే టాటా మోటార్స్ మొదటి మూడు నెలల కాలంలో ఏకంగా 1,08,700 కమర్షియల్ వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాదితో పోలిస్తే విక్రయాల్లో 26 శాతం వృద్ధి నమోదైంది. స్వదేశీ మార్కెట్‌లో అమ్మకాలు 26 శాతం పెరగ్గా, విదేశాలకు చేసిన ఎగుమతులు 35 శాతం మేర ఊపందుకున్నాయి. ఈ ఊపుతో భారతీయ కమర్షియల్ వెహికల్ మార్కెట్‌లో టాటా తన వాటాను 36.8 శాతానికి పెంచుకుని, మునుపటి త్రైమాసికం కంటే 100 బేసిస్ పాయింట్ల పురోగతి సాధించింది.

పెరిగిన ఖర్చులు.. మార్జిన్లపై స్వల్ప ఒత్తిడి

అమ్మకాలు, రాబడి జోరుగా సాగినప్పటికీ కంపెనీ నిర్వహణ వ్యయాలు కూడా పెరిగాయి. మొదటి త్రైమాసికంలో ఇబిట్డా 10 శాతం పెరిగి రూ.2,300 కోట్లకు చేరినప్పటికీ, ఇబిట్డా మార్జిన్ మాత్రం 90 బేసిస్ పాయింట్లు తగ్గి 10.9 శాతంగా నమోదైంది. పెరిగిన ముడిసరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయం ఏటా 13 శాతం చొప్పున పెరగడమే ఈ మార్జిన్ల క్షీణతకు ప్రధాన కారణం. అయినప్పటికీ బలమైన డిమాండ్ కారణంగా కంపెనీ సమర్థవంతంగా ప్రతికూలతలను అధిగమించగలిగింది.

రాణించిన స్టాక్ మార్కెట్

త్రైమాసిక ఫలితాల వెల్లడికి ముందే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‎లో టాటా మోటార్స్ షేరు 2 శాతం మేర పుంజుకుని రూ. 457 వద్ద ముగిసింది. ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ షేరు మరింత రాణించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story