Tata Cars: పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ సెగ్మెంట్లలో టాటా మాస్టర్ ప్లాన్.. మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు
మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు

Tata Cars: భారత ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ కార్ల లైనప్‌ను మరింత విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ త్వరలోనే నూతన టిగోర్ సెడాన్, ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సఫారీ ఈవీలను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొత్త టిగోర్‌ను పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ మోడళ్లలో అధునాతన ఫీచర్లతో ప్రవేశపెడుతుండగా, సఫారీ ఈవీతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా సఫారీ ఈవీ - ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
టాటా నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ సఫారీ ఈవీ. ఇది కంపెనీకి చెందిన మొట్టమొదటి 3-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. దీనిని హారియర్ ఈవీ కంటే పై స్థాయిలో రీపోజిషన్ చేయనున్నారు. ఈ వాహనాన్ని టాటా అడ్వాన్స్‌డ్ acti.ev ఆర్కిటెక్చర్‌పై డిజైన్ చేస్తున్నారు. ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. అలాగే రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లను ఇందులో అందించనున్నారు. ఫ్రంట్ క్లోజ్డ్ గ్రిల్, ఈవీ-స్పెషల్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ లైటింగ్ విజన్ దీనికి ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి.
న్యూ టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
న్యూ టాటా టిగోర్ సెడాన్ ప్రస్తుత 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోనే కొనసాగనుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 86 PS పవర్, సీఎన్‌జీ మోడ్‌లో 73.4 PS పవర్‌ను విడుదల చేస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో సరికొత్త కలర్ ఆప్షన్లు, మోడర్న్ బాడీ ఎలిమెంట్స్ అందించనున్నారు. ఫీచర్ల పరంగా ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ ఏసీ వెంట్స్, రైన్-సెన్సింగ్ వైపర్లు ఉండే అవకాశం ఉంది.
అప్‌డేటెడ్ టిగోర్ ఈవీ, మల్టీ-పవర్‌ట్రెయిన్ స్ట్రాటజీ
టిగోర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా కొత్త ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌తో అప్‌డేట్ కానుంది. టియాగో ఈవీ తరహాలోనే దీని డిజైన్, ఇంటీరియర్ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. న్యూ టిగోర్ ఈవీలో 25 kWh నుంచి 34 kWh వరకు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. దీనితో పాటు టాటా సరికొత్త 6-ఇన్-1 డ్రైవ్‌ట్రెయిన్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు. ఒకే ప్లాట్‌ఫామ్‌పై పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లను అందిస్తూ వినియోగదారులకు బడ్జెట్, అవసరాలకు తగిన ఎంపికలను అందించడమే టాటా ముఖ్య వ్యూహం.

