Tata Motors : టాటా మోటార్స్ ఈవీ సంచలనం.. మార్కెట్లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు
మార్కెట్లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు

Tata Motors : భారతదేశపు నంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈవీ మార్కెట్లో తన తిరుగులేని ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త ప్లాన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాపులర్ కార్లయిన టియాగో, టియాగో ఈవీలను అప్‌డేట్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు దేశీ మార్కెట్లోకి మరో రెండు భారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఆటోమొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ వచ్చే జూన్ 30, 2026న లాంచ్ కాబోతుండగా.. టాప్ ఎండ్ లగ్జరీ మోడల్ టాటా సఫారీ ఈవీ ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా మార్కెట్లోకి రానుంది.
ఈ రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లలో అందించబోయే అత్యంత అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఇస్తున్నారు. సాధారణంగా అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలలో మాత్రమే కనిపించే ఈ ప్రత్యేక సాంకేతికతను టాటా తమ కొత్త కార్లలో జోడిస్తోంది. ఈ ఏడబ్ల్యూడీ సిస్టమ్ వల్ల కారుకు కఠినమైన, బురద రోడ్లపై అద్భుతమైన గ్రిప్ లభిస్తుంది. అంతేకాకుండా, వాహనం వేగంగా దూసుకెళ్లడానికి, ఘాట్ రోడ్లు, కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు కారు అదుపు తప్పకుండా స్థిరంగా సాగిపోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఈ రెండు సరికొత్త ఎస్‌యూవీల పవర్‌ట్రైన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం వీటిలో టాటా హారియర్ ఈవీకి సంబంధించిన పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌ను ఉపయోగించనున్నారు. ఈ కార్లు 65kWh, 75kWh అనే రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానున్నాయి. కస్టమర్ల ఛాయిస్ కోసం ఇందులో సింగిల్ మోటార్, డ్యుయల్ మోటార్ ఆప్షన్లను అందిస్తారు. అయితే, లగ్జరీ ఏడబ్ల్యూడీ ఫీచర్ కావాలనుకునే వారు డ్యుయల్ మోటార్ ఉన్న టాప్ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హారియర్ ఈవీ లోని 65kWh వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 538 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 75kWh మోడల్ ఏకంగా 627 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇదే పవర్‌ఫుల్ సెటప్‌ను కొత్త సియెర్రా ఈవీ, సఫారీ ఈవీలలో కూడా వాడుతుండటం వల్ల, ఇవి ప్రాక్టికల్‌గా రోడ్లపై ఒకే ఒక్క ఫుల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల నగరాల్లోనే కాకుండా సొంతూళ్లకు లాంగ్ జర్నీలు చేసే వారికి ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ పూర్తిగా తొలగిపోతుంది.
సాంకేతిక పరంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, దీనివల్ల చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. వీటితో పాటు మోడరన్ ఫీచర్లయిన V2L (Vehicle-to-Load), V2V (Vehicle-to-Vehicle) టెక్నాలజీలను ఇస్తున్నారు. వీ2ఎల్ ఫీచర్ ద్వారా కారు బ్యాటరీని ఉపయోగించి ల్యాప్‌టాప్‌లు, ఓవెన్లు లేదా చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులను రన్ చేసుకోవచ్చు. అలాగే వీ2వీ ఫీచర్ సహాయంతో చుట్టుపక్కల ఏదైనా మరో ఎలక్ట్రిక్ కారు ఆగిపోతే, మన కారు నుంచి దానికి ఛార్జింగ్ ఇచ్చి హెల్ప్ చేయవచ్చు.
టాటా సియెర్రా ఈవీ మరియు సఫారీ ఈవీల బాడీ డిజైన్ చాలా వరకు వాటి పాత పెట్రోల్, డీజిల్ మోడళ్లలాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ కార్లుగా వీటికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. ముందు భాగంలో సరికొత్త సీల్డ్ గ్రిల్, మోడరన్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, బాడీపై అక్కడక్కడా ఈవీ బ్యాజింగ్స్, గాలిని తట్టుకుని మైలేజ్ పెంచేలా ఎయ్రో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్‌ను అమర్చారు. మొత్తానికి, అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ రేంజ, అద్భుతమైన ఏడబ్ల్యూడీ టెక్నాలజీతో రాబోతున్న ఈ రెండు కార్లు భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

